రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరోసారి ఘాటుగా స్పందించారు. మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మోదీ.. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించకుండా, ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడకుండా.. కాంగ్రెస్‌పై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడుతుంది. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాజాగా మరోసారి స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో చేసిన ప్రసంగంలో రెండు వాస్తవాలను బట్టబయలు చేశారని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
‘పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ప్రసంగం రెండు పెద్ద వాస్తవాలను బట్టబయలు చేసింది. 1. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కాంగ్రెస్సే తప్ప TRS కాదు. 2. BJP తెలంగాణను ద్వేషిస్తుంది.. తెలంగాణ కోసం ఏమీ చేయలేదు’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తెలంగాణ అమరవీరులను అవమానించినందుకు ప్రధాని మోదీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇక, ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఇదివరకే స్పందించిన రేవంత్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు దిగజారి మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. అన్ని ప్రాంతాలను సమభావంతో చూసేలా ప్రధాని ప్రసంగం ఉండాలన్నారు. అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి అధమ స్థాయిలో మాట్లాడితే ఎలా ఉంటుందో Rajya Sabha లో ప్రధాని మోడీ ప్రసంగం ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. Gujarat సీఎంగా ఉన్న keshubhai patel ను తప్పించాల్సి వచ్చిన సమయంలో అరుణ్ జైట్లీని అడ్డు పెట్టుకొని అద్వానీని మేనేజ్ చేసి గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టారన్నారు. గుజరాత్ కు సీఎంగా అయ్యాక తన గురువైన అద్వానీకే నరేంద్ర మోడీ పంగనామాలు పెట్టారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
‘మోదీ ఏ పదవీ లేకుండా ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్నప్పుడు 1997లో బీజేపీ కాకినాడ ప్లీనరీలో ఒక ఓటుకు రెండు రాష్ట్రాలు అని తెలంగాణ ఏర్పాటుపై తీర్మానం చేశారు. దానికి ఇప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. ఆ తర్వాత 1999లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో బీజేపీ 7 స్థానాలు గెలిచింది. అందులో తెలంగాణలో నాలుగు స్థానాలు ఉన్నాయి. ఇక్కడి ప్రజలు 4 స్థానాల్లో బీజేపీని గెలిపిస్తే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడి ప్రజలను మోసం చేసింది. జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది కానీ, తెలంగాణ మాత్రం ఇవ్వలేదు’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
కాకినాడ తీర్మాణానికి కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి ఉంటే 1200 మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకొనే వారు కాదు కదా అని ఆయన ప్రశ్నించారు. 2004 ఎన్నికల ప్రచార సభలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని చెప్పారు. 2009 తర్వాత ఏపీలోని కాంగ్రెస్ కు చెందిన ఎంపీలు ఒత్తిడి చేసినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.తెలంగాణ ప్రజలను , తెలంగాణ జాతికి క్షమాపణలు చెప్పాలన్నారు. పార్లమెంట్ లో ఏ బిల్లుపైనైనా ఓటింగ్ జరిగే సమయంలో పార్లమెంట్ తలుపులు మాస్తారన్నారు. ప్రధానిగా ఉన్న వ్యక్తికి ఈ విషయం కూడా తెలియదా అని ఆయన ఎద్దేవా చేశారు.
