ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) హైదరాబాద్‌లో పర్యటన కోసం నేడు మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడ ప్రధాని మోదీకి స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) హైదరాబాద్‌లో పర్యటన కోసం నేడు మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడ ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ సోమేష్ కుమార్ తదితరులు స్వాగతం పలికారు. తన పర్యటనలో భాగంగా మోదీ.. తొలుత పఠాన్‌చెరులోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవ వేడుకలను ప్రారంభించారు. అంతేకాకుండా కొత్త లోగోను ఆవిష్కరించారు. అనంతరం ముచ్చింతల్‌లోని ఆశ్రమానికి చేరుకుని.. అక్కడ రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. 216 అడుగుల ఎత్తైన సమతామూర్తి విగ్రహానికి మోదీ.. చినజీయర్​ స్వామితో కలిసి పూజచేస్తారు. తర్వాత సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితమివ్వనున్నారు. అనంతరం ఢిల్లీ తిరిగి వెళ్లనున్నారు.

సహజంగా ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు విమానాశ్రయం వద్దే రాష్ట్ర ప్రజల తరఫున గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు స్వాగతం పలుకుతారు. అయితే ప్రధాని మోదీకి ఆహ్వాసం పలికేందుకు కేసీఆర్ విమాశ్రయానికి వెళ్లలేదు. అయితే కేసీఆర్ జ్వరంగా ఉండటంతో ఆయన ప్రధానికి స్వాగతం పలికేందుకు వెళ్లలేదని అధికార వర్గాలు నుంచి సమాచారం. అయితే ఇందుకు ఒక్క రోజు ముందుగానే ప్రధాని మోదీకి స్వాగతం పలకడంతో పాటు, వీడ్కోలు పలికే బాధ్యతలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు కేసీఆర్ అప్పగించినట్టుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. 

ఇక, మోదీ అంతకుముందు 2020 నవంబర్ 28న హైదరాబాద్‌కు వచ్చారు. కోవిడ్ వ్యాక్సిన్‌ అభివృద్దికి సంబంధించి పర్యటనలో భాగంగా మోదీ.. కోవాగ్జిన్ టీకాను అభివృద్ది చేసిన భారత్ బయోటెక్‌ను సందర్శించారు. అయితే ఆ సందర్భంలో సీఎం కేసీఆర్ విమానాశ్రయానికి రావాల్సిన అవసరం లేదని పీఎంవో కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందింది. దీంతో అప్పుడు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మరికొందరు అధికారులు ప్రధానికి స్వాగతం పలికారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య వాగ్యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ పర్యటన జరిగింది.

ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనిస్తే.. గత కొంత కాలం బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్దం సాగుతుంది. కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రలు, టీఆర్‌ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కేసీఆర్ మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే కేసీఆర్.. ప్రధాని మోదీకి స్వాగతం పలకడానికి వెళ్లకుండా ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. 

Scroll to load tweet…


ఇదిలా ఉంటే.. తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి స్వాగతం పలకడానికి సీఎం కేసీఆర్ రాకపోవడం తెలంగాణ బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచకుపడింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ ట్విట్టర్‌లో ఓ పోస్టు చేసింది. ‘అనుకున్న విధంగానే జరిగింది.. ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన కేసీఆర్.. తన ప్రాధాన్యత లేని మంత్రిని పంపడం ద్వారా మరింతగా దిగజారారు’ అని పేర్కొంది. అంతేకాకుండా NCBN (చంద్రబాబు నాయుడు), పంజాబ్ సీఎం చరణ్ సింగ్ చన్నీ అడుగుజాడలను కేసీఆర్ అనుసరిస్తున్నాడని విమర్శించింది. ఇందుకు తిరిగి మూల్యం చెల్లించుకుంటారని మండిపడింది.

Scroll to load tweet…

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. జ్వరం ఉందని తప్పించుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చినా రాలేనంత బీజీ షెడ్యూల్‌ ఏముందని మండిపడ్డారు. కేసీఆర్.... ఇదేనా మీ సంస్కారం? 80 వేల పుస్తకాలు చదివానన్న మీ జ్ఝానం ఏమైపోయింది? అంటూ ప్రశ్నించారు. దేశ ప్రధాని రాష్ట్రానికి వచ్చినా రాలేనంత బిజీ షెడ్యూల్ ఏముంది? అంటూ కేసీఆర్‌ను ప్రశ్నించారు. మీరు కోరినప్పుడల్లా ప్రధాని అపాయిట్ మెంట్ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయారా? రాష్ట్రానికి ప్రధాని వస్తే స్వాగతం పలకాలనే సోయి లేకుండా ఫాంహౌజ్ కే పరిమితమవుతారా? అంటూ నిలదీశారు.