ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు (Hyderabad) రానున్నారు. అయితే ప్రధాని మోదీకి స్వాగతం, వీడ్కోలు పలికే కార్యక్రమాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు (Hyderabad) రానున్నారు. అయితే ప్రధాని మోదీకి స్వాగతం, వీడ్కోలు పలికే కార్యక్రమాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు. అలాగే ప్రధాని మోదీ పర్యటన ముగిసి తర్వాత వీడ్కోలు పలకనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. సహజంగా ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు విమానాశ్రయం వద్దే రాష్ట్ర ప్రజల తరఫున గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు స్వాగతం పలుకుతారు. అయితే ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రధానికి స్వాగతం పలకడానికి కేసీఆర్ వెళ్లడం లేదు. ఆయనకు బదులు ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను పంపడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇక, ప్రధాని నరేంద్ర మోదీ నేడు మధ్యాహ్నం 2.10 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో పఠాన్‌చెరులోని ఇక్రిశాట్ క్యాంపస్‌కు చేరుకుంటారు. ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవ వేడుకలను మోదీ ప్రారంభించనున్నారు. స్వాగత కార్యక్రమానికి సీఎం దూరంగా ఉండటంతో ప్రధాని వెంట గవర్నర్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇక్రిశాట్‌కు వెళ్లే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక్రిశాట్ వేడుకల తర్వాత ప్రధాని మోదీ దాదాపు 5 గంటల ప్రాంతంలో ఆయన ముచ్చింతల్‌లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. 216 అడుగుల ఎత్తైన సమతామూర్తి విగ్రహానికి మోదీ.. చినజీయర్ స్వామితో కలిసి పూజచేస్తారు. తర్వాత సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితమివ్వనున్నారు.అక్కడ జరిగే ప్రత్యేక పూజల్లో మోదీ పాల్గొంటారు. ఇక్కడ కార్యక్రమాలు పూర్తయ్యాక శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి ఢిల్లీకి బయలుదేరుతారు.
రామానుజుల సహస్రాబ్ది వేడుకల్లో వేడుకల్లో ప్రధానితో కలిసి..
ప్రధాని మోదీ స్వాగత, వీడ్కోలు కార్యక్రమాలకు దూరంగా ఉండనున్న కేసీఆర్.. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు కూడా కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. ముచ్చింతల్‌లో జరిగే రామానుజుల సహస్రాబ్ది వేడుకల్లో మాత్రం ప్రధానితో కలిసి పాల్గొననున్నట్టుగా తెలుస్తోంది. శనివారం మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి కుమారుడి వివాహం శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతోంది. సీఎం కేసీఆర్ ఆ వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ముచ్చింతల్‌కు రానున్నారు. అక్కడ మోదీతో కలిసి Ramanujacharya Sahasrabdi Samarohamలో పాల్గొననున్నారు.
ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఇది..
ప్రధాని మోదీ శనివారం మధ్యాహ్నం 2.10 గంటలకు ప్రత్యేక విమానంలో Shamshabad international airportకు చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్‌లో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌కు వెళతారు. అక్కడ ఇక్రిశాట్ స్వర్ణోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక్రిశాట్ నూతన లోగోను ఆవిష్కరిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరానికి చేరుకుంటారు. కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాక.. యాగశాలలో పూర్ణాహుతి, విశ్వక్సేన ఇష్టి హోమంలో పాల్గొంటారు. తర్వాత దివ్యక్షేత్రాలను, రామానుజుల బంగారు విగ్రహం ప్రతిష్టాపన స్థలాన్ని పరిశీలిస్తారు.
సాయంత్రం 6.15 గంటల నుంచి రామానుజుల భారీ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేసి, ఆవిష్కరిస్తారు. సుమారు 7 గంటల సమయంలో ప్రసంగం చేస్తారు. అనంతరం రుత్విక్కుల నుంచి వేదాశీర్వచనం, చినజీయర్ స్వామి నుంచి మహా ప్రసాదాన్ని అందుకుంటారు. అనంతరం 8.20 గంటలకు ముచ్చింతల్ ఆశ్రమం నుంచి రోడ్డు మార్గంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరుతారు. అక్కడి నుంచి 8.40 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళతారు.
అసాధారణ రీతిలో భద్రత..
ప్రదాని మోదీ పర్యటన నేపథ్యంలో భాగ్యనగరం నిఘా నీడలోకి వెళ్లిపోయింది. ఇటీవల ‘‘పంజాబ్‌లో భద్రతా లోపం’’ (modi security breach) నేపథ్యంలో పీఎంవో వర్గాలు ముందే అప్రమత్తమయ్యాయి. ఈ మేరకు మోడీ పర్యటన సాగే ప్రాంతాలైన ముచ్చింతల్, పటాన్ చెరులోని ఇక్రిసాట్ ప్రాంతాల్లో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఆ రెండు ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకొని కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కేంద్ర బృందాలు, రాష్ట్ర పోలీసులు సహా దాదాపు 7,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGAI) సహా రెండు వేదికల వద్దా ఫూల్ ప్రూఫ్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.
