మన్‌కీ బాత్‌లో (Mann Ki Baat) పుస్తకాల గొప్పతనం గురించి వివరించే క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi).. తెలంగాణకు చెందిన డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య (Dr Kurella Vittalacharya) గురించి ప్రస్తావించారు. ఈ సందర్బంగా విఠలాచార్యపై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు.  

భారత దేశం అసాధారణ ప్రతిభతో నిండి ఉందని.. అటువంటివాళ్ళ చేతలు ఇతరులను కూడా ఏదైనా చెయ్యాలనిపించే ప్రేరణను అందిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం తన మన్‌కీ బాత్‌లో (Mann Ki Baat) పుస్తకాల గొప్పతనం గురించి వివరించే క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi).. తెలంగాణకు చెందిన డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య (Dr Kurella Vittalacharya) గురించి ప్రస్తావించారు. విఠలాచార్యపై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ‘మన భారతదేశం ఎంతో అసాధారణ ప్రతిభతో నిండి ఉంది. అటువంటివాళ్ళ చేతలు ఇతరులను కూడా ఏదైనా చెయ్యాలనిపించే ప్రేరణను అందిస్తాయి. అటువంటివారే తెలంగాణాకు చెందిన డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య. ఆయను వయసు 84 ఏళ్లు. కలలను సాకారం చేసుకోవడానికి వయసు అడ్డంకి కాదని ఆయన నిరూపించారు. 

ఆయన చిన్నతనం నుంచే పెద్ద గ్రంథాలయాన్ని నడపాలనే కోరిక ఉండేంది. కానీ అప్పుడు దేశం బ్రిటీషు వారి పాలనలో ఉంది. అప్పటి పరిస్థితుల వల్ల ఆయన చిన్ననాటి కల కలగానే ఉండిపోయింది. అది నెరవేరలేదు. అయితే ఆయన పెద్దయ్యాక లెక్చరర్ అయ్యారు. తెలుగు భాష గురించి అధ్యయనం చేసి పుస్తకాలు రచించారు. ఆరేడేళ్ల క్రితం తన కలను నెరవేర్చుకునేందుకు ఆయన ప్రయత్నం చేశారు. తన సొంత పుస్తకాలతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. జీవితకాలపు ఆదాయాన్ని ఆయన ఇందులో పెట్టారు. 

తర్వాత ప్రజలు కూడా ఆయనకు వారి వంతు సహకారాన్ని అందించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట మండలంలోని ఈ గ్రంథాలయంలో దాదాపు 2 లక్షల పుస్తకాలు ఉన్నాయి. చదువుకోవడానికి తన పడ్డ కష్టాలు.. ఇంకెవరూ పడకూడదనే ఉద్దేశంతోనే ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసినట్టుగా విఠలాచార్య చెప్తారు. నేడు పెద్ద సంఖ్యలో జనాలు గ్రంథాలయాలకు వస్తుండటంతో ఆయన సంతోషిస్తున్నారు. ఆయన వల్ల స్ఫూర్తి‌తో ఇతర గ్రామాల్లోనూ గ్రంథాలయాలను నెలకొల్పుతున్నారు’ అని తెలిపారు. 

Scroll to load tweet…

ఇక, కూరెళ్ల విఠలాచార్య యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నేమల గ్రామంలో 1938 జూలై 9న జన్మించారు. లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. తాను నివాసం ఉంటున్న ఎల్లంకి గ్రామంలో 2014లో 4 వేల పుస్తకాలతో గ్రంథాలయం ప్రారంభించారు. ఆచార్య కూరెళ్ల గ్రంథాలయం పేరుతో నిర్వహిస్తున్న ఈ గ్రంథాలయంలో 2 లక్షల పుస్తకాలు ఉన్నాయి.