టీ జేఏసీ నేత పిట్టల రవీందర్ మరోసారి కోదండరాంపై విరుచకపడ్డారు. ఆయన ఫ్యూడల్ భావజాలంతో వ్యవహరిస్తున్నారని మండిపడుతూ ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో అన్ని పార్టీలను ఏకం చేసిన ఘనత తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ పునర్ నిర్మాణం కోసం టీ జేఏసీ నేతలు ఇంకా తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
అందులో భాగంగానే అధికార పార్టీ వైఫల్యాపై టీ జేఏసీ నేతలు ఉద్యమించారు. ఇటీవల లక్ష ఉద్యోగాల ప్రకటనపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు నిరుద్యోగ నిరసన ర్యాలీ చేపట్టారు. అయితే ఈ ర్యాలీ తర్వాత టీ జేఏసీ నేతల మధ్య విభేదాలు ఒక్కసారిగా బయట పడ్డాయి.

జేఏసీ కన్వీనర్ పిట్టల రవీందర్... కోదండరాంను టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగారు. ర్యాలీ వైఫల్యానికి కోదండరాం కారణమని ధ్వజమెత్తారు. టీజేఏసీ అంతర్గత భేటీలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఈ విషయం బయటకు పొక్కలేదు.
అయితే ఇప్పుడు పిట్టల రవీందర్ తో పాటు తన్వీర్ సుల్తానా, ప్రహ్లాద్ లు టీ జేఏసీ తీరుపై బహిరంగ లేఖ సంధించారు. సామాజిక న్యాయ సాధనలో టీ జేఏసీకి సరైన అవగాహన లేదని ఆ లేఖలో ధ్వజమెత్తారు. టీ జేఏసీ రాజకీయ పార్టీలకు వత్తాసు పలకడం సరికాదని విమర్శించారు.
సమష్టి ఆలోచన లేకుండా జేఏసీ ముందుకు వెళుతోందని, కోదండరాం ఫ్యూడల్ భావజాలతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జేఏసీ వేదికపై పార్టీలను సమర్థిస్తూ మాట్లాడటం సరికాదన్నారు. టీ జేఏసీ రాజకీయ పార్టీల మారుతుందని విమర్శించారు.
రాజకీయల్లోకి వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చని కానీ, జేఏసీని రాజకీయ పార్టీగా మార్చొద్దని అన్నారు. తామంతా ఆమోదిస్తేనే కోదండరాం చైర్మన్ అయ్యారని గుర్తు చేశారు. ఆయనకు మహిళలు, మైనారిటీలపై గౌరవం లేదని ఆరోపించారు.
సమష్టి ఆలోచన, ఉమ్మడి కార్యాచరణ అనే సిద్దాంతానికి వ్యతిరేకంగా కోదండరాం వెళుతున్నారని మండిపడ్డారు.
