Asianet News TeluguAsianet News Telugu

భాగ్యలక్ష్మి ఆలయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పూజలు.. బండి సంజయ్‌కు సవాలు.. 24 గంటలు డెడ్‌లైన్..

తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి శనివారం ఉదయం పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రోహిత్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు సవాలు విసిరారు. 

pilot rohith reddy offers prayers at bhagyalakshmi temple and challenge to bandi sanjay
Author
First Published Dec 17, 2022, 11:37 AM IST

తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఆర్థిక పత్రాలు, ఆదాయపు పన్ను రిటర్న్‌లను డిసెంబర్ 19లోగా సమర్పించాలని ఈడీ నోటీసులు జారీచేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 50 కింద ఈ నోటీసులు జారీచేశారు. అయితే తనకు ఈడీ నోటీసులు ఇవ్వడం విచిత్రంగా ఉందని పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. తనకు నోటీసు వస్తుందని ముందే ఎలా తెలుసో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఈ క్రమంలోనే పైలెట్ రోహిత్ రెడ్డి శనివారం ఉదయం పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రోహిత్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేదని అన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి సమక్షంలో ఆ కేసుపై ప్రమాణం చేద్దామని బండి సంజయ్‌కు సవాలు విసిరారు. 

తాను రేపు ఇదే సమయానికి ఇక్కడికే వస్తున్నామని.. బండి సంజయ్‌ కూడా ఇక్కడకు వచ్చి తనపై చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు చూపెట్టాలని కోరారు. తనపై చేసిన ఆరోపణలను బండి సంజయ్ రుజువు చేయాలని సవాలు విసిరారు. లేకపోతే బండి సంజయ్ దొంగ హిందువని తెలంగాణ ప్రజలు నమ్ముతారని అన్నారు. కర్ణాటక పోలీసుల నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పారు. 

బండి సంజయ్ తంబాకు తినడం మానేయాలని.. నోరు తిరగడం లేదని, ఆయన ఏం చెబుతున్నారో కూడా అర్థం కావడం లేదని విమర్శలు గుప్పించారు. బండి సంజయ్ చెప్పినట్టుగానే తనకు నోటీసులు వచ్చాయని.. ఈ విషయం ఆయనకు ముందే ఎలా తెలుసని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు వస్తాయని ఢిల్లీలోని బీజేపీ నాయకులు ముందే చెబుతురాని అన్నారు. 

బీజేపీ  నాయకులు దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని.. హిందూత్వం పేరుతో దేశంలోని యువతను మభ్యపెడుతున్నారని విమర్శించారు. అసలైన హిందూత్వవాది తెలంగాణ సీఎం కేసీఆర్ అని.. చరిత్రలో ఎవరూ ఆలోచించని విధంగా యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా పుననిర్మించారని చెప్పారు.బీజేపీ నేతలు పబ్బం గడుపుకోవడానికి మాయ మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. మునుగోడు ప్రజలు చెంపపెట్టులాగా తీర్పు ఇచ్చిన బీజేపీకి బుద్ది రాలేదని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్దిని చూసి బీజేపీ ఓర్వలేకపోతుందని విమర్శించారు. అందుకే కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతుందని మండిపడ్డారు.  

ఇదిలా ఉంటే.. ‘‘డిసెంబర్ 19న హాజరు కావాలని నాకు సమన్లు అందాయి. నా ఐడెండిటీ ప్రూఫ్స్, ఐటీ రిటర్న్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, కుటుంబ వ్యాపార వివరాలు, ఆదాయ వనరులు, కుటుంబ సభ్యుల ఆదాయాన్ని సమర్పించాల్సిందిగా ఈడీ నన్ను కోరింది. నేను నా న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నాను. నా కుటుంబ సభ్యులకు గానీ, నాకు గానీ గుట్కా వ్యాపారంతో ఎలాంటి సంబంధం లేదు. నా కుటుంబ సభ్యులపై ఎటువంటి కేసు లేదు. కుటుంబ సభ్యులలో ఎవరికీ ఎటువంటి నోటీసు ఇవ్వలేదు. 2015 నుంచి నా చర, స్థిరాస్తులు, బ్యాంకు రుణాల వివరాలను సమర్పించాల్సిందిగా ఈడీ నన్ను కోరింది. బెంగళూరు డ్రగ్స్ కుంభకోణంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. కర్ణాటక పోలీసులు నన్ను ఎప్పుడూ పిలవలేదు. ఇది మొట్టమొదటి సమన్లు, వారు నన్ను ఏ కేసు కోసం పిలుస్తున్నారో వారు ప్రస్తావించలేదు’’ అని రోహిత్ రెడ్డి శుక్రవారం తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios