హైదరాబాద్:మున్సిపల్ ఎన్నికల్లో  తాము విజయం సాధిస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధీమాను వ్యక్తం చేశారు.

శుక్రవారం నాడు టీఆర్ఎస్ భవన్‌లో టీఆర్ఎస్  రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం కేటీఆర్ అధ్యక్షతన జరిగింది. రానున్న  మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీఆర్ఎస్ కార్యవర్గసమావేశంలో చర్చించారు.  

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. 2014 నుండి ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.

ఎన్నికలు ఏవైనా ప్రజలంతా టీఆర్ఎస్ వైపే నిలిచిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.  గడిచిన ఐదేళ్లలో తాము ఎక్కడా కూడ నేల విడిచి సాము చేయలేదన్నారు. ప్రజలు కోరుకొన్న విధంగానే తాము పాలన సాగించినట్టుగా ఆయన తెలిపారు.

తెలంగాణలోని 141 మున్సిపాలిటీల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామని  కేటీఆర్ ధీమాను వ్యక్తం చేశారు.ప్రజలకు  మౌళిక వసతులు కల్పించే అజెండాతో తాము ముందుకు వెళ్తున్నట్టుగా కేటీఆర్ చెప్పారు.

ఆ అజెండాను బలపర్చే విధంగా తమ పార్టీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.  ఎన్ఆర్‌సీపై పార్లమెంటరీ కమిటీ నిర్ణయమై ఫైనల్  అని  చెప్పారు.

ప్రజలకు కావాల్సిన సౌకర్యాల విషయంలో చాలా పురోగతి సాధించినట్టుగా ఆయన మంత్రి తెలిపారు.తరతమ బేధాలు లేకుండా పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసినట్టుగా తెలిపారు. ప్రజలకు కావాల్సిన వసతులను అందించాలనే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్టుగా  కేటీఆర్ తెలిపారు.