మంథని: భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.50లక్షలతో ఇంటినుండి బయలుదేరిన ఇద్దరు అదృశ్యమైన ఘటన పెద్దపల్లి జిల్లాలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇలా శనివారం మాయమైన ఇద్దరు వ్యక్తులు తిరిగి సోమవారం తెల్లవారుజామున ప్రత్యక్షమయ్యారు. తమను కొంతమంది కిడ్నాప్‌ చేసి డబ్బులు కాజేశారని చెబుతున్న వీరిపై అనుమానం కలగడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపారు. దీంతో ఈ ఘటనలో సంచలన విషయాలు బయటపడ్డాయి.  

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పెద్దపల్లి డిసిపి రవీందర్ వివరించారు. భూమి కొనుగోలు పేరిట ఇంటినుండి డబ్బులతో బయలుదేరి అటవీ ప్రాంతంలో కిడ్నాప్ కు గురయినట్లు రామగిరి మండలం లద్నాపూర్ గ్రామానికి చెందిన చిప్ప రాజేశం, ఉడుత మల్లయ్యలు నాటకం ఆడినట్లు పేర్కొన్నారు. 

''రెండు రోజుల క్రితం మంథని అటవీ ప్రాంతంలో కిడ్నాప్ గురైనట్లు నిందితులు నాటకం అడారు. విచారణ నిమిత్తం సీన్ రికన్స్ట్రక్షన్ చేయడానికి కిడ్నాప్ జరిగినట్లు చెప్పిన ప్రాంతానికి నిందితులిద్దరిని తీసుకెళ్లి వివరాలు అడగ్గా పొంతనలేని సమాధానాలు చేపట్టడంతో అనుమానం వచ్చింది.దీంతో వారిని విచారించగా అసలు నిజాన్ని బయటపెట్టారు'' అని డిసిపి తెలిపారు.

నిందితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 4 సంవత్సరాల క్రితం తాము భూమి కొనుగోలు కోసం ఓ వ్యక్తికి రూ.36లక్షలు ఇచ్చామని... ఇప్పటివరకు అతడు భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా డబ్బులు వాపస్ చేయకుండా తిప్పించుకున్నాడని తెలిపారు. దీంతో సదరు భూ యజమానిని భయపెట్టి డబ్బులు తిరిగి రాబట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ కిడ్నాప్ నాటకం ఆడినట్లు నిందితులు తెలిపినట్లు డిసిపి రవీందర్ తెలిపారు.

ఈవిధంగా కిడ్నాప్ డ్రామా ఆడి పోలీసుల విలువైన సమయాన్ని వృదా చేయడమే కాకుండా ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన నిందితులు చిప్ప రాజేశం, ఉడుత మల్లయ్య లపై కఠిన చర్యలు తీసుకుంటామని డిసిపి తెలిపారు. ఈ కిడ్నాప్ నాటకాన్ని అత్యంత చాకచక్యంగా ఛేదించిన పోలీసులకు డిసిపి రవీందర్ పారితోషికం అందజేశారు.