జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఆ పార్టీకి కామన్ సింబల్ కేటాయించడం కుదరదని తెలంగాణ ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. దీంతో జనసేన తెలంగాణలో తన గాజు గ్లాసు గుర్తును కోల్పోయింది.

తాజాగా వెలువడిన మినీ మున్సిపల్ ఎన్నిక సమరంలో అన్ని చోట్లా పోటీ చేయాలని జనసేన నిర్ణయించుకుంది. ఐదు మున్సిపాల్టీలతో పాటు ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు 30వ తేదీన జరగనున్నాయి.

దీనికి సంబంధించి తమ అభ్యర్ధులకు ఉమ్మడి గుర్తును కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి జనసేన దరఖాస్తు చేసుకుంది. అయితే నిబంధనల ప్రకారం కామన్ సింబల్ కేటాయించాలంటే.. ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో కనీసం పది శాతం సీట్లలో అయినా పోటీ చేసి ఉండాలి.

Also Read:జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు కోవిడ్ పాజిటివ్

అయితే జనసేన ఇటీవలి గ్రేటర్ ఎన్నికల్లో పదిశాతం సీట్లలో పోటీ చేయలేదు... అసలు పోటీకే దూరమైంది. దీంతో నిబంధనల ప్రకారం గాజు గ్లాసు గుర్తును కేటాయించలేమని ఎస్ఈసీ తెలిపింది.

దీనిపై… జనసేన.. ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నందున పోటీ చేయలేకపోయామని… ఈసారి అన్ని చోట్లా పోటీ చేస్తామని ఉమ్మడి గుర్తు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది.

అయితే జనసేన వివరణపై తెలంగాణ ఎస్ఈసీ సంతృప్తి చెందలేదు. కామన్‌గా గాజు గ్లాస్ గుర్తు కేటాయించేందుకు అంగీకరించలేదు. దీంతో ఆ గుర్తు స్వతంత్రులకు కేటాయించనుంది ఈసీ.