హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. మంగళవారంనాడు 71 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే, జిహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా కేసులు నమోదవుతున్నాయి. కొంత మంది నిర్వాకం వల్ల కూడా కోవిడ్ -19 కట్టడి కాకపోగా, విస్తరిస్తూ ఉంది. అటువంటి సంఘటనే హైదరాబాదులో జరిగింది. 

హైదరాబాదు శివారులోని పహాడీషరీఫ్ లో జరిగిన ఓ ఫంక్షన్ లో పాల్గొన్న 22 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. వారిలో 13 మంది ఒకే కుటుంబానికి చెందినవారు. పహాడీషరీఫ్ లోని మటన్ వ్యాపారి కుటుంబ సభ్యులు, బంధువులు ప్రతి యేటా వేసవిలో ఒక చోటు సరదాగా గడపడం ఆనవాయితీగా వస్తోంది. 

ఎప్పటిలాగే ఈసారి కూడా పది రోజుల క్రితం నాలుగు కుటుంబాలకు చెందిన 28 మంది వేడుక చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ వేడుకకు జియాగుడా, గౌలిపురా, బోరబండ ప్రాంతాల నుంచి ముగ్గురు చొప్పున సంతోష్ నగర్ నుంచి ఐదుగురు హాజరయ్యారు. వారితో పాటు మటన్ వ్యాపారి బంధువులు పాల్గొన్నారు.

మొత్తం 42 మంది ఒక చోట చేరి సరదాగా గడిపారు. రెండు రోజుల పాటు వేడుక చేసుకున్నారు. ఆ తర్వాత వారిలో 18 మంది మహేశ్వరం మండలం హర్షగుడాలో కిరాణా షాపు నడిపించే బంధువు ఇంటికి వచ్చారు. ఆయన నలుగురు కుటుంబ సభ్యులతో కలిసి వేడుక చేసుకున్నారు. 

బోరబండ నుంచి వేడుకకు హాజరైన ముగ్గురికి, సంతోష్ నగర్ నుంచి వచ్చినవారిలో ఇద్దరికి నాలుగు రోజుల కిందట కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. పహడీషరీఫ్ లో జరిగిన విందు విషయం తెలిసి వైద్య సిబ్బంది, అందులో పాల్గొన్న 28 మందిని ఈ నెల 23వ తేదీన హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. 

సోమవారం వారి శాంపిల్స్ పరీక్షించగా 13 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. కిరాణా కొట్టు వ్యాపారి కుటుంబానికి నలుగురికి పాజిటివ్ వచ్చింది. దాంతో వేడుకలో పాల్గొన్న మొత్తం 22 మంది కరోనా వైరస్ సోకింది. 

పహడీషరీఫ్ లో కరోనా వ్యాధి సోకిన వ్యక్తి మటన్ వ్యాపారి కావడంతో ఆ ప్రాంతంలో ఆరోగ్య సిబ్బంది సర్వే చేశారు. అతని వద్ద మటన్ కొన్నారని భావించిన వారిని పరిశీలించారు. ప్రాథమిక కాంటాక్ట్ కింద 21 మందిని, సెకండరీ కాంటాక్ట్ కింద 47 మందిని గుర్తించి రావిర్యాల క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. 

కిరాణాకొట్టు వ్యాపారి నుంచి ఎంత మంది సరుకులు కొనుగోలు చేశారనే విషయంపై కూడా అధికారులు ఆరా తీశారు. ఆ బస్తీలో ఉండే 125 ఇళ్లను గుర్తించి కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేశారు.