Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ రెడ్డిని కలిసిన డీఏవీ స్కూల్ అత్యాచార బాధిత చిన్నారి తల్లిదండ్రులు..న్యాయం జరిగేలా చూడాలని వేడుకోలు...

హైదరాబాద్ లో కలకలం రేపిన డీఏవీ స్కూల్ అత్యాచార బాధిత చిన్నారి తల్లిదండ్రులు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు. 
 

Parents of DAV school rape victim met Revanth Reddy, hyderabad
Author
First Published Oct 21, 2022, 2:06 PM IST

హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని డీఏవీ స్కూల్ అత్యాచార బాధిత చిన్నారి తల్లిదండ్రులు శుక్రవారం కలిశారు. స్కూల్ యాజమాన్యం, బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. 

చిన్నారిపై పైశాచిక చర్యకు పాల్పడిన వారికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. ఈ క్రమంలో సీవీ ఆనంద్ తో రేవంత్ ఫోన్ లో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి తప్పక న్యాయం జరిగేలా చూస్తానని చిన్నారి తల్లిదండ్రులకు రేవంత్ హామీ ఇచ్చారు. 

కాగా, అక్టోబర్ 19న హైదరాబాద్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. డీఏవీ స్కూల్ ప్రిన్సిపల్ డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తి నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. స్కూలుకు వచ్చే ఆ చిన్నారిపై గత రెండు నెలలుగా డ్రైవర్ రజనీకుమార్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. కాగా, తమ కుమార్తె ప్రవర్తనలో మార్పు రావడం తల్లిదండ్రులు గమనించారు. తీవ్ర మనస్థాపానికి గురైన చిన్నారి ప్రతీ చిన్న దానికి ఏడవడం మొదలుపెట్టింది. డిప్రెషన్ లోకి వెళ్లింది. దీంతో తల్లిదండ్రులు చిన్నారిని సోమవారం ప్రశ్నించారు. అలా విషయం వెలుగులోకి వచ్చింది. 

రాజా సింగ్‌పై పీడీ యాక్ట్: విచారణ ఈ నెల 28కి వాయిదా.. కౌంటర్‌ దాఖలు చేయకపోవడంతో ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్..

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతంలో 4 ఏళ్ల బాలికపై ప్రిన్సిపాల్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాలిక లోయర్ కిండర్ గార్టెన్ విద్యార్థిని. ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. డ్రైవర్ రజనీకుమార్ గత రెండు నెలలుగా బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. తమ కుమార్తె ప్రవర్తనలో మార్పు రావడంతో ప్రశ్నించిన తల్లిదండ్రులు బాలిక తెలిపిన విషయాన్ని విని షాక్ అయ్యారు. వెంటనే పోలీసులను సంప్రదించారు. 

డ్రైవర్ డిజిటల్ క్లాస్ రూమ్‌లోకి వస్తూ పిల్లలను ఇబ్బంది పెట్టేవాడని, చాలా మంది పిల్లలు అతనికి భయపడుతున్నారని పోలీసులు తెలిపారు. సీనియర్ పోలీసు అధికారి జోయెల్ డేవిస్ తెలిపిన వివరాల ప్రకారం, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయి తల్లి మీడియాతో మాట్లాడుతూ... “నా కూతురు డిప్రెషన్‌లో ఉంది. ఎక్కువగా మాట్లాడలేకపోతోంది. ఆమె మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడింది. దీనికి కారణమైన నిందితుడిని బహిరంగంగా నగ్నంగా కొట్టాలి. ప్రిన్సిపాల్‌ని వెంటనే బర్తరఫ్ చేయాలి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 

"డీఏవీ స్కూల్ మంచిదని పాఠశాలకు డొనేషన్ కూడా ఇచ్చాం. దాన్నంతా తిరిగి ఇవ్వాలి. ఎందుకంటే ఇక మా కుమార్తెను మళ్లీ ఆ పాఠశాలకు పంపం. అది ఎంతో పేరున్న స్కూల్ కావచ్చు. కానీ ప్రిన్సిపాల్ స్వయంగా మంచిది కాదు. ఇంత జరుగుతున్నా ఆమెకు తెలియకపోవడం.. తన డ్రైవర్ చేస్తున్న పనిని పట్టించుకోకపోవడం ఏంటి? ఎలాంటి వ్యక్తులను నియమించుకున్నారు? ఇంత దారుణమైన నేరం చేయడానికి ఎవరూ సాహసించని విధంగా నిందితులకు శిక్ష పడాలి' అని ఆమె అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios