రాజా సింగ్‌పై పీడీ యాక్ట్: విచారణ ఈ నెల 28కి వాయిదా.. కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్..
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ రద్దు చేయాలంటూ ఆయన భార్య ఉషాబాయి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను తెలంగాణ హైకోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది.
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ రద్దు చేయాలంటూ ఆయన భార్య ఉషాబాయి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను తెలంగాణ హైకోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు కౌంటర్ దాఖలు చేయకపోవడంతో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. పీడీయాక్ట్ పెట్టడానికి గల కారణాలను కౌంటర్‌లో పేర్కొనాలని స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయకుంట ఆర్డర్ ఇస్తామని తెలిపింది.
ఇక, తన భర్త రాజాసింగ్‌పై మోపిన పీడీ యాక్ట్ చట్టవిరుద్ధమని ప్రకటించి, ఆయనను విడుదల చేయాలని రాజా సింగ్ భార్య ఉషాబాయి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఈ నెల 11న జస్టిస్ ఎ అభిషేక్ రెడ్డి, జస్టిస్ శ్రీదేవిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు సమావేశం ఇటీవలనే ముగిసిందని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ బోర్డు నిర్ణయం ఇంకా పెండింగ్ లో ఉందన్నారు. ఈ నిర్ణయం వచ్చే వరకు సమయం కావాలని కోరారు. కనీనం రెండు వారాల సమయం ఇవ్వాలని అడిగారు.
మరోవైపు ఉషాబాయి దాఖలు చేసిన పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాది ఎల్ రవి చందర్ వాదనలు వినిపిస్తూ.. సకాలంలో ఎమ్మెల్యేకు పత్రాలు అందించడంలో పోలీసులు విఫలమైనందున, హైదరాబాద్ పోలీసులు జారీ చేసిన పీడీ యాక్ట్‌ను పక్కన పెట్టి జైలు నుంచి విడుదల చేసేందుకు అవకాశం ఉందని వాదించారు. ఇరువైపుల వాదలను విన్ని ధర్మాసనం.. ఇందుకు సంబంధించి అక్టోబర్ 20లోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.
అంతకుముందు.. సెప్టెంబర్ 7న మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు కోర్టు నోటీసు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.