ఉస్మానియా ఉద్యమాలపై డేగ కన్ను

osmania comes under close scrutiny cc tvs
Highlights

  • అడుగడుగునా సిసి కెమరాలు
  • ఆందోళనలు, దొంగతనాలపై నజర్
  • ఓయు పోలీసు స్టేషన్ తో అనుసంధానం
  • కోటికి పైగా ఖర్చు చేసిన సర్కారు
  • ప్రస్తుతం 156 కెమెరాలు, మరిన్ని పెంచుతామన్న అధికారులు

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సర్కారు సిసి కెమెరాలు ఏర్పాటు చేసింది. మొదటి దశలో 156 సిసి కెమెరాలను అమర్చారు. అన్ని ప్రధాన దారుల్లో ఈ సిసి కెమరాలు ఏర్పాటు చేశారు. దీనికోసం దాదాపు కోటి ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఈ సిసి కెమెరాల కండ్లు ఎంత అద్భుతంగా పనిచేస్తాయంటే కిలోమీటరు దూరంలో ఉన్న దృశ్యాలను సైతం బంధించగలవు. ఈ సిసి కెమెరాలను ఓయు పోలీసు స్టేషన్ తో అనుసంధానం చేశారు.

విద్యార్థుల భద్రత కోసమే ఈ సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని ఉస్మానియా అధికారులు చెబుతున్నారు. త్వరలోనే హాస్టళ్ల వద్ద కూడా సిసి కెమెరాలు బిగిస్తామని అధికారులు అంటున్నారు. చైన్ స్నాచింగ్ కేసులు ఉస్మానియా పరిధిలో జరుగుతున్నందన ఈ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. 

మరోవైపు ఉస్మానియాలో విద్యార్థుల ఆందోళనా కార్యక్రమాలను కంట్రోల్ చేసే ఉద్దేశం ఈ సిసి కెమెరాల ఏర్పాటుకు అసలు కారణంగా చెబుతున్నారు. గత దశాబ్ద కాలంగా తెలంగాణ ఉద్యమ కాలంలో ఉస్మానియా పోరాటాలకు కేంద్ర బిందువుగా మారింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాల కోసం విద్యార్థులు అనునిత్యం ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.

ఈనేపథ్యంలో ఆందోళనలు చేస్తున్నప్పటికీ వాటిని రికార్డ్ చేసే వ్యవస్థ పోలీసులకు అందుబాటులో లేదు. దీంతో ఈ సిసి కెమెరాలు ఏర్పాటు తర్వాత సిసి పుటేజీ ఆధారంగా ఏ చిన్న ఆందోళన చేసినా వారిని గుర్తించి కేసులు నమోదు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని విద్యర్థి సంఘాలు అనుమానాలను వ్య్తం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఉస్మానియాలో ఇకపై చీమ చిటుక్కుమన్నా పోలీసులు రియాక్ట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

చైన్ స్నాచింగ్ కేసులు, దొంగతనాల కంట్రోల్ కోసమని అధికారులు చెబుతున్నప్పటికీ విద్యార్థి ఉద్యమాలపై ఉక్కుపాదం మోపే ఉద్దేశంలో భాగంగానే ఈ సిసి కెమెరాల ఏర్పాటు అని విద్యార్థి నేతలు అనుమానిస్తున్నారు. ఇటీవల కాలంలో విశ్వవిద్యాలయాల్లో చదువు తప్ప ఏ రకమైన ఉద్యమాలు చేపట్టరాదంటూ సర్కులర్ వచ్చిందని, దానికి కొనసాగింపే సిసి కెమెరాల బిగింపు అని విద్యార్థి నేతలు చెబుతున్నారు. 

 

సరికొత్త తాజా తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

loader