శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష సభ్యులందరినీ సస్పెండ్ చేయడం పట్ల ప్రతిపక్ష నేత జానారెడ్డి తీవ్ర అసహనాన్ని, ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శాసనసభ మీడియా పాయింట్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారో చదవండి.

అసెంబ్లీలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం అప్రజాస్వామికం. సంప్రదాయాలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నారు. కానీ సస్పెన్షన్ నిర్ణయంలో ఊటంకించినటువంటి చట్టంలోనూ స్పష్టత లేదు. ఇది చీకటి రోజు. నిన్న జరిగిన సంఘటన గవర్నర్ పరిధిలో ఉంది. దానిపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ స్పీకర్ ఎలా చర్యలు తీసుకుంటారు. ఈ రోజు నుంచి జరిగే సంఘటనలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నియమనిబంధనలను పాటించకుండా ప్రధాన ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేయడం తగదు.

మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని  రద్దు చేసినట్లు చెబుతున్నారు. దీనిపై మేము న్యాయపరంగా పోరాడుతాం. తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీకి చెందిన సభ్యులను సస్పెండ్ చేయడం అరాచకం. సంయమనం పాటించి నిలబడిన నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు? అల్లరిలో నేను పాలుపంచుకోకపోయినా ప్రధాన ప్రతిపక్ష నేత అయిన నన్ను సస్పెండ్ చేయడం తగునా? ప్రతిపక్ష నేతను కూడా సస్పెండ్ చేయడమంటే ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దారుణం లేదు. మండలి నాయకుడు షబ్బీర్ అలీ ని కూడా సస్పెండ్ చేయడం దారుణం.

బడ్జెట్ లో ఉండే లోపాలు, ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపుతామనే ఉద్దేశంతోనే మమ్మల్ని సస్పెండ్ చేశారు. ఈ అంశాన్ని పార్లమెంటుకు నివేదిస్తాం. రాజ్యాంగ నిపుణులను సంప్రదిస్తాం. రాజ్యాంగ ఉల్లంఘనకు, చట్ట వ్యతిరేక చర్యకు సంకేతంగా భావిస్తున్నాం.