ఓ ఆర్థోపెడిక్ డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఎడమకాలికి చేయాల్సిన ఆపరేషన్ కుడికాలికి చేశాడు. ఆ తరువాత గుర్తించి మళ్లీ కుడికాలికి కూడా ఆపరేషన్ చేశాడు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఎడమ కాలికి చేయాల్సిన ఆపరేషన్ కుడి కాలికి చేశాడు. రెండు రోజుల తర్వాత తాను చేసిన తప్పిదాన్ని గ్రహించి.. నాలుక కరుచుకుని.. తిరిగి ఎడమ కాలికి ఆపరేషన్ చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో రాష్ట్ర వైద్య మండలి.. ఆ డాక్టర్ గుర్తింపును రద్దు చేసింది. ఆ డాక్టర్ పేరు కరణ్ ఏం పాటిల్. తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి చైర్మన్ వి రాజలింగం గురువారం నాడు అతని తప్పిదానికి గాను డాక్టర్ గా పాటిల్ గుర్తింపును 6 నెలల పాటు రద్దు చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
కరణ్ ఎం పాటిల్ హైదరాబాదులోని ఈసీఎల్ ప్రాంతంలో ఆర్థోపెడిక్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో తన దగ్గరికి వచ్చిన రోగికి ఎడమ కాలికి ఆపరేషన్ చేయాల్సి ఉండగా కుడి కాలికి చేశాడు. అయితే ఈ తప్పిదాన్ని వెంటనే గుర్తించలేదు. రెండు రోజుల తర్వాత గుర్తించి తిరిగి ఎడమ కాలికి ఆపరేషన్ చేశాడు. దీనిపై బాధితులు లబోదిబో మంటూ డిఎంహెచ్ఓను ఆశ్రయించారు. ఆయనకు ఈ మేరకు ఫిర్యాదు చేయడంతో.. దీని మీద విచారణ చేపట్టి నిజమే అని తేలడంతో గుర్తింపును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
గురువారంనాడే మరో వైద్యుడు గుర్తింపును కూడా మూడు నెలల పాటు రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి చైర్మన్ వి రాజలింగం ఇంకో ఉత్తర్వును జారీ చేశారు. సిహెచ్ శ్రీకాంత్ అనే వైద్యుడు గుర్తింపును మూడు నెలల పాటు రద్దు చేశారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి డెంగ్యూ వ్యాధితో ఆసుపత్రిలో చేరాడు. అతనికి చికిత్స అందించిన శ్రీకాంత్.. సరైన సమయంలో అతడిని పెద్ద ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించాలని సిఫార్సు చేయలేదు. దీంతో సదరు డెంగ్యూ రోగి మృతి చెందాడు.
బాధిత కుటుంబసభ్యులు ఈ విషయాన్ని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిమీద విచారణ చేపట్టిన తర్వాత వైద్యుడు నిర్లక్ష్యమే అతని మృతికి కారణమని నిర్ధారించారు. కలెక్టర్ నివేదికను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర వైద్య మండలి శ్రీకాంత్ మీద విచారణ చేసి అతడి గుర్తింపును రద్దు చేసినట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. గుర్తింపు రద్దు అయిన ఈ ఇద్దరు డాక్టర్లు తమ సర్టిఫికెట్లను రాష్ట్ర వైద్య మండలికి అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. గుర్తింపు రద్దు మీద 60 రోజుల్లో అప్పీలు చేసుకోవడానికి వైద్యులకు అవకాశం కల్పించినట్లు కూడా తెలిపారు.
