ట్రిమ్మర్ ఆర్డర్ చేస్తే.. కండోమ్ ప్యాకెట్లు వచ్చాయి

First Published 16, Jul 2018, 12:34 PM IST
online service cheating.. man orderd trimmer but he got condom packets
Highlights

సదరు కంపెనీపై నమ్మకం ఏర్పడడంతో ఈనెల 11న మరో షేవర్‌ మిషన్‌ కొనుగోలుకు అదే సంస్థకు ఆర్డర్‌ ఇచ్చారు. ఆదివారం కొరియర్‌ బాయ్‌ ఇంటికి వచ్చి పార్సిల్‌ ఇచ్చాడు. తీరా దాన్ని తెరిచి చూడగా దాంట్లో కండోమ్‌ ప్యాకెట్లు కనిపించాయి. 

ప్రస్తుత కాలంలో ఆన్ లైన్ అమ్మకాలవైపే ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. దీనిని కొన్ని విక్రయ సంస్థలు అవకాశం చేసుకుంటున్నాయి. దీంతో.. ఆన్ లైన్ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ట్రిమ్మర్ ఆర్డర్ చేసుకుంటే.. కండోమ్ ప్యాకెట్లు  వచ్చాయి. ఈ సంఘటన గోదావరిఖనిలో ఆదివారం చోటు చేసుకుంది. 

బాధితుడు తెలిపిన వివరాల మేరకు... గోదావరిఖని లక్ష్మీనగర్‌లో ఎనగందుల శ్రీనివాస్‌ సెలూన్‌నిర్వహిస్తున్నాడు. కస్టమర్లకు మెరుగైన సేవలందించడం కోసం ఇటీవల ఎలక్ట్రిక్‌షేవర్‌ మిషన్‌ కొనుగోలు చేయాలని స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఓ ప్రముఖ ఆన్‌లైన్‌ కంపెనీలో ఆర్డర్‌ చేయడంతో పంపించారు. షేవర్‌ను వాడకముందే అది పని చేయలేదు. దీంతో ఆన్‌లైన్‌ సంస్థకు ఫిర్యాదు చేయడంతో, షేవర్‌ను స్వాధీనం చేసుకొని డబ్బులు తిరిగి పంపించారు.

సదరు కంపెనీపై నమ్మకం ఏర్పడడంతో ఈనెల 11న మరో షేవర్‌ మిషన్‌ కొనుగోలుకు అదే సంస్థకు ఆర్డర్‌ ఇచ్చారు. ఆదివారం కొరియర్‌ బాయ్‌ ఇంటికి వచ్చి పార్సిల్‌ ఇచ్చాడు. తీరా దాన్ని తెరిచి చూడగా దాంట్లో కండోమ్‌ ప్యాకెట్లు కనిపించాయి. విస్తూపోయిన బాధితుడు హుటాహుటిన సదరు కొరియర్‌ కార్యాలయానికి వెళ్లి నిలదీశాడు. 

తమకు సంబంధం లేదని, ఆర్డర్‌ ఇచ్చిన ఆన్‌లైన్‌ సంస్థకే ఫిర్యాదు చేయాలని చెప్పి తప్పించుకున్నారు. దీంతో సదరు సంస్థకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయడంతో, ఆర్డర్‌ చేసిన వస్తువుకు మరోసారి పరిశీలించి పంపిస్తామని అప్పటి వరకు డబ్బులు తిరిగి ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. 

కస్టమర్‌ చేతికి రిటన్‌ ఆర్డర్‌గా బుక్‌ చేసిన షేవింగ్‌ మిషన్‌ పార్సిల్‌ వచ్చాక, కండోమ్‌ ప్యాకెట్లను తిరిగి పంపించాలని సంస్థ ప్రతినిధులు సూచించారని బాధితుడు తెలిపాడు. తక్కవ ధరలో లభిస్తున్నాయనే ఆశతో ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే ఇలాంటి మోసాలే జరుగుతాయని పలువురు వెల్లడిస్తున్నారు. అయితే ఇలాంటి మోసాలపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

loader