ఈసారి పార్లమెంట్ బరిలో దిగుతున్నా : ఖర్గేతో భేటీ తర్వాత జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఈసారి తాను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు తెలంగాణ కాంగ్రెస్ కురువృద్ధుడు జానారెడ్డి . ఈసారి తన కుటుంబం నుంచి ఒకరు అసెంబ్లీకి పోటీ చేస్తారని తెలిపారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ అనంతరం జానారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
మాజీ సీఎల్పీ నేత, తెలంగాణ కాంగ్రెస్ కురువృద్ధుడు జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి తాను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో జానారెడ్డి భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈసారి తన కుటుంబం నుంచి ఒకరు అసెంబ్లీకి పోటీ చేస్తారని తెలిపారు. కాంగ్రెస్‌ను గెలిపించడానికి ఐక్యవేదిక కావాలని తాము ఖర్గేకు వివరించామని.. దీనికి ఆయన ఐక్యంగా పోరాడాలని సూచించారని జానారెడ్డి వెల్లడించారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు సీనియర్ల నిర్ణయం పార్టీ శ్రేణుల్లో ఆసక్తిని రేకిత్తిస్తోంది. సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ ఎల్‌బీ నగర్ నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నారు. గతంలో ఆయన రెండు సార్లు నిజామాబాద్ ఎంపీగా పనిచేశారు. 2014, 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈసారి ఆయన అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే టికెట్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు.
ALso Read: జానారెడ్డి సంచలన నిర్ణయం.. ఎన్నికల బరి నుంచి తప్పుకున్న పెద్దాయన, బదులుగా రంగంలోకి కుమారుడు
ఇటు జానారెడ్డి కూడా పోటీ చేస్తారా లేదా అన్నది ఆసక్తి రేపింది. ఆయన ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకోలేదు. అయితే జానారెడ్డి నియోజకవర్గం నాగార్జున సాగర్ నుంచి ఆయన కుమారుడు జైవీర్ రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన ఇప్పటికే దరఖాస్తు సమర్పించారు. ఇవాళ జానారెడ్డి స్వయంగా తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో సస్పెన్స్‌కు తెరపడింది. హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నుంచి ఆయన భార్య ఉత్తమ్ పద్మావతి అప్లికేషన్ పెట్టుకున్నారు.
కాగా.. నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం (గతంలో చలకుర్తి) నియోజకవర్గం నుండి జానారెడ్డి ఏడు దఫాలు విజయం సాధించారు. రెండు దఫాలు ఓటమి పాలయ్యాడు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల నర్సింహ్మయ్య చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయాడు. అయితే నర్సింహయ్య మరణంతో ఉపఎన్నికలు రావడంతో మరోసారి పోటీ చేసిన జానారెడ్డి.. నోముల భగత్ చేతిలో ఓటమి పాలయ్యారు.