నల్లగొండ మున్సిపల్ ఛైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్ కేసు క్షణ క్షణం మలుపులు తిరుగుతున్నది. నిన్నటికి నిన్న నల్లగొండ జిల్లా కోర్టులో ఎ1 నుంచి ఎ5 వరకు నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. దానిపై కోర్టు విచారణ జరిపి.. ఎ1 నుంచి ఎ5 వరకు నిందితులందరినీ పోలసు కస్టడీకి ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది.

తాజాగా బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో నిందితులకు మరో షాక్ తగిలే చాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ హత్య కేసులో సంబంధం ఉన్న నిందితుల్లో ఎ6 నుంచి ఎ11 వరకు నిందితులకు బెయిల్ మంజూరైంది.  ఈ ఆరుగురిలో ఇప్పటికే ఇద్దరు నిందితులు బెయిల్ పార్మాలిటీస్ పూర్తి చేసి బెయిల్ మీద బయటకొచ్చారు. మిగతా నలుగురు బెయిల్ ఫార్మాలిటీస్ పూర్తి చేయకపోవడంతో ఇంకా జైలులోనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో హత్య జరిగి వారం రోజులు కూడా కాకముందే అప్పుడే నిందితులకు బెయిల్ ఎలా వచ్చిందని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. దీంతో నిందితులతో పోలీసులు కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. నిందితులపై తీవ్రత లేని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని, అందుకే వారందరికీ అల్కగా బెయిల్ వచ్చిందని మున్సిపల్ ఛైర్ పర్సన్ లక్ష్మితోపాటు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

ఈ పరిస్థితుల్లో నష్ట నివారణ చర్యల్లో భాగంగా పోలీసులు బెయిల్ మీద విడుదలైన నిందితుల బెయిల్ క్యాన్సల్ చేయాలంటూ నల్లగొండ జిల్లా కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. అయితే నిన్న కేవలం ఎ1 నుంచి ఎ5 వరకు నిందితుల పోలీసు కస్టడీ కేసు మాత్రమే విచారణ జరిగింది. నేడు రెండో పిటిషన్ కూడా కోర్టులో బెంచ్ ముందుకు వచ్చింది. విచారణ మొదలు పెట్టింది న్యాయస్థానం. కేసును నెల 15వ తేదీకి వాయిదా వేసింది.

ఇక్కడ మరో షాకింగ్ ట్విస్ట్ ఏమంటే.. ఇప్పటికే ఈ కేసులో బెయిల్ మీద బయటకొచ్చిన వారు ఇద్దరు కాగా. బెయిల్ మంజూరైనా జైలులోనే మగ్గుతున్నవారు మరో నలుగురు ఉన్నారు. ఇక బెయిల్ రద్దు అయితే ఆ నలుగురికి జైలులోనే నోటీసులు జారీ చేసే వెసులుబాటు పోలీసులకు ఉంటుంది. మరి బెయిల్ మీద వచ్చిన వారికి ఎలా నోటీసులు ఇస్తారన్నది తేలాల్సి ఉంది. ఈనెల 15వ తేదీలోగా బెయిల్ మీదున్న ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేయాలంటూ న్యాయస్థానం ఆదేశించింది.

మొత్తానికి బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో బెయిల్ మీదున్న నిందితులకు బెయిల్ రద్దవుతుందా? లేక పోలీసుల పిటిషన్ క్యాన్సల్ అవుతుందా అన్నది ఈనెల 15న తేలిపోనుంది.