టీడీపీకి రాజీనామా చేసిన మరో నేత

జగిత్యాల జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్‌ తగిలింది. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ ముఖ్య అనుచరుడు, జగిత్యాల నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జిగా పని చేసిన బోగ వెంకటేశ్వర్లు పార్టీకి రాజీనామా చేశారు. మహానాడు వేదికగా రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఎంపీ కవిత సమక్షంలో టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే ఆయన టీఆర్‌ఎస్‌లో చేరడం చకచకా సాగిపోయింది. 15రోజుల క్రితం కోరుట్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జిగా ఉన్న సాంబారి ప్రభాకర్‌ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోగా, తాజాగా జగిత్యాల ఇన్‌ఛార్జి గులాబీ గూటికి చేరుకోవడంతో జగిత్యాలలో టీడీపీ ఢీలా పడినట్లయింది.