కసరత్తు చేస్తున్న ఆర్థిక శాఖ సిఎం ఆమోదం కోసం పంపిన ఫైలు ఇప్పటికే ఉద్యోగ సంఘాల వినతి త్వరలోనే ఉత్తర్వులు వచ్చే చాన్స్

తెలంగాణ ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కేసిఆర్ సర్కారు తాజాగా మరో శుభవార్త అందించనుంది. ఈమేరకు సర్కారు కసరత్తు ముమ్మరం చేసింది. ఆ శుభవార్త ఏమిటో పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

సెప్టెంబరు 30వ తేదీన దసరా, అంతకంటే ముందు ఈనెల 29న సద్దుల బతుకమ్మ పండుగలు వరుసగా వస్తన్నాయి. దీంతో ఈ రెండు పండుగలు నెలాఖరును వస్తుండడంతో ఉద్యోగులకు పండగ ఖర్చులకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే సర్కారు ఒక నిర్ణయం తీసుకునే చాన్స్ ఉందని చెబుతున్నారు.

అందుకే తెలంగాణ సర్కారు ఆ రెండు పండుగల కంటే ముందే తెలంగాణ ఉద్యోగులకు ఈనెల జీతం ఇవ్వాలని సంకల్పించింది. ఈమేరకు సీఎం ఆమోదానికి ఆర్థిక శాఖ ఫైలు పంపింది. దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఈనెల జీతం ముందుగానే చెల్లించి వారు ఆనందంగా దసరా పండుగ జరుపుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.

ప్రతి నెలా ప్రభుత్వ ఉద్యోగులకు నెల జీతాలను ఒకటో తేదీన ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ ఈనెల 29న సద్దుల బతుకమ్మ, 30న దసరా పండుగలు కావటంతో జీతాన్ని ముందుగా చెల్లిస్తే ఉద్యోగులకు పండుగ ఖర్చులకు ఉపయోగపడుతుందనే అభిప్రాయాలున్నాయి.

ఇప్పటికే ఉద్యోగ సంఘాలు సైతం ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. ఆర్థిక శాఖ ప్రతిపాదనలకు సీఎం ఆమోదం లభించిన వెంటనే జీతాల ముందస్తు చెల్లింపుపై స్పష్టత రానుంది. రెండు మూడు రోజుల్లోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. సిఎం ఆమోదం తెలిపితే ఈనెల 28వ తేదీనే జీతాలు అందుకునే అవకాశం ఉందని సచివాలయ ఉద్యోగుల సంఘం నేత ఒకరు తెలిపారు.