Asianet News TeluguAsianet News Telugu

ఎంపి కవిత ఖాతాలో మరో విజయం

  • ఫలించిన ఎంపి కవిత కృషి
  • నిజామాబాద్ కు ఐటి హబ్
  • నిజామాబాద్ ఐటిహ‌బ్‌ ఉత్త‌ర తెలంగాణ‌కు కూడ‌లి 
one more feather in the cap of kavitha

నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత కృషి ఫ‌లించింది. సోమ‌వారం నిజామాబాద్‌కు ఐటి హ‌బ్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం మంజూరు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇటీవ‌లే ఖ‌మ్మంలో ఐటి హ‌బ్‌ను ఏర్పాటు చేసిన ప్ర‌భుత్వం తాజాగా నిజామాబాద్‌కు ఐటి హ‌బ్‌కు అనుమ‌తులు ఇచ్చింది. సెక్ర‌టేరియెట్‌లో మంత్రి కె. తార‌క రామారావు నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత‌, నిజామాబాద్ అర్బ‌న్ ఎమ్మెల్యే బిగాల గ‌ణేశ్ గుప్తాకు అనుమ‌తి ప‌త్రాల‌ను అంద‌జేశారు. అనంత‌రం ఎంపి క‌విత మీడియా తో మాట్లాడారు. నిజామాబాద్‌కు ఐటి ట‌వ‌ర్‌తో పాటు ఇంక్యుబేట‌ర్‌ను మంజూరు చేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. దీని కోసం రూ. 50 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. ఎమ్మెల్యే గణేశ్ గుప్తా కృషితో 60 ఐటీ కంపెనీలు నిజామాబాద్ ఐటీ హబ్‌లో కార్యకలాపాలు సాగించేందుకు ముందుకు వచ్చాయి అని ఆమె వెల్లడించారు.

one more feather in the cap of kavitha

నిజామాబాద్ ఐటిహ‌బ్‌ ఉత్త‌ర తెలంగాణ‌కు కూడ‌లిగా త‌యారు కాబోతోంద‌న్నారు. వ‌చ్చే ద‌స‌రా నాటికి హ‌బ్ ప్రారంభం అవుతుంద‌ని ఎంపి క‌విత తెలిపారు. తెలంగాణ‌లో ఎక్క‌డా లేని విధంగా ప‌దివేల స్వ్కేర్ ఫీట్ల విస్తీర్ణంలో ఇంక్యుబేట‌ర్ నిర్మాణం జ‌రుగుతుంద‌న్నారు. ఐటి ఉద్యోగాలపై ఉన్న మక్కువ తో ఐటి కోర్సుల‌ను తెలంగాణ విద్యార్థులు అభ్య‌సిస్తున్నార‌ని, ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌తో పాటు ఇత‌ర జిల్లాల్లోనూ ఐటి పార్క్స్‌ను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని తెలిపారు. ఈ క్ర‌మంలోనే ఖ‌మ్మంలో మొద‌టి ఐటి ట‌వ‌ర్‌ను ఏర్పాటు చేసిన ప్ర‌భుత్వం త‌ర్వాత మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా దివిటి ప‌ల్లిలో 400 ఎక‌రాల్లో ఐటి, ఇండ‌స్ట్రియ‌ల్ హ‌బ్ ఏర్పాటుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించిందని క‌విత వివ‌రించారు. ఇప్పుడు నిజామాబాద్‌లో ఐటి ట‌వ‌ర్‌, ఇంక్యుబేట‌ర్ మంజూర‌వ‌డం ప‌ట్ల నిజామాబాద్ ప్రాంత ప్ర‌జ‌ల ప‌క్షాన సిఎం కేసిఆర్‌కు, మంత్రి కేటిఆర్‌కు క‌విత కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

one more feather in the cap of kavitha

మున్సిపాల్టీల అభివృద్ధికి రూ. 350 కోట్లు మంజూరు

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీల అభివృద్ధికి రూ. 50 కోట్ల చొప్పున రూ. 250 కోట్లు, నిజామాబాద్ కార్పొరేషన్‌ అభివృద్ధికి రూ. 100 కోట్లు క‌లిపి మొత్తం రూ. 350 కోట్లు మంజూరయ్యాయని నిజామాబాద్  ఎంపీ క‌ల్వ‌కుంట్ల‌ కవిత తెలిపారు. ఏప్రిల్ 6వ తేదీన  ఆర్మూర్ లో జ‌రిగిన జ‌న‌హిత ప్ర‌గ‌తి స‌భ‌కు ముఖ్య అతిథిగా హాజ‌ర‌యిన మంత్రి కెటిఆర్‌ను నిజామాబాద్ పార్ల‌మెంటు ప‌రిధిలోని బోధ‌న్‌, ఆర్మూర్‌, క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని జ‌గిత్యాల‌, మెట్‌ప‌ల్లి, కోరుట్ల మున్సిపాల్టీల‌కు రూ.50 కోట్లు చొప్పున‌, నిజామాబాద్ కార్పోరేష‌న్‌కు రూ.100 కోట్లు మంజూరు చేయాల‌ని క‌విత కోరారు. ప‌ట్ట‌ణాల అభివృద్ధికి ముఖ్య‌మంత్రి కెసిఆర్ ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నార‌ని, తప్ప‌కుండా క‌విత కోరిక మేర‌కు నిధుల‌ను శాంక్ష‌న్ చేస్తామ‌ని స‌భ‌లోనే  మంత్రి కేటిఆర్  హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీ మేర‌కు ఇవాళ జీఓ విడుద‌ల‌వ‌డం గ‌మనార్హం.  నిజామాబాద్ ప‌సుపు రైతుల‌ను ఆదుకునేందుకు పసుపు బోర్డు ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని ఎంపీ కవిత స్పష్టం చేశారు. స‌మావేశంలో మ‌హ‌బూబాబాద్ ఎంపి ప్రొఫస‌ర్ సీతారాం నాయ‌క్, నిజామాబాద్ అర్బ‌న్, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఎమ్మెల్యేలు బిగాల గ‌ణేశ్ గుప్తా, శ్రీనివాస్ గౌడ్‌లు పాల్గొన్నారు. 

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/EaqWDi

             

Follow Us:
Download App:
  • android
  • ios