Asianet News TeluguAsianet News Telugu

వృద్ధురాలి ప్రాణం తీసిన రూమ్‌ హీటర్‌...

చలి చంపేస్తోందనుకుంటే వెచ్చదనం కాటేసింది. వెచ్చదనం కోసం గదిలో ఏర్పాటు చేసుకున్న రూమ్‌ హీటర్‌ హైదరాబాద్ లో ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో ఆ హీటర్‌లో చేలరేగిన మంటలకు కదలలేని స్థితిలో మంచంపై పడుకున్న వృద్ధురాలు బలైంది. 

old woman died due to short circuit in room heater - bsb
Author
Hyderabad, First Published Jan 12, 2021, 3:08 PM IST

చలి చంపేస్తోందనుకుంటే వెచ్చదనం కాటేసింది. వెచ్చదనం కోసం గదిలో ఏర్పాటు చేసుకున్న రూమ్‌ హీటర్‌ హైదరాబాద్ లో ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో ఆ హీటర్‌లో చేలరేగిన మంటలకు కదలలేని స్థితిలో మంచంపై పడుకున్న వృద్ధురాలు బలైంది. 

హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేశవ డాలే అపార్ట్‌మెంట్స్‌ 101లో రిషేంద్ర వేలూరి తన తల్లి నిర్మల(78)తో కలిసి నివాసం వుండేవాడు. ఇటీవల  అతనికి వివాహం జరగడంతో అదే అపార్ట్‌మెంట్‌ అయిదవ అంతస్తులో వేరే ఫ్లాట్ తీసుకుని భార్యతో కలిసి ఉంటున్నాడు. తల్లి నిర్మల ఒక్కతే 101 ఫ్లాట్‌లో ఉంటోంది. 

తల్లికి రెండు కాళ్లూ పనిచేయక, కదలలేని స్థితిలో ఉంది. దీంతో ఆమెకోసం ఒక పనిమనిషిని పెట్టుకున్నారు. చలి కాలం కావడంతో ఆమె పడుకునే మంచం పక్కనే వెచ్చదనం కోసం రూమ్‌ హీటర్‌ను ఏర్పాటు చేశారు. రోజూ లాగే ఆ రోజు కూడా హీటర్ పెట్టి పనిమనిషి వెళ్లిపోయింది. ఓ రాత్రి వేళ విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ అయి హీటర్‌లో మంటలు లేచాయి. పక్కనే ఉన్న మంచానికి మంటలు అంటుకున్నాయి. 

కదలలేని స్థితిలో మంచంపై పడుకున్న నిర్మలకు కూడా మంటలు అంటుకున్నాయి. నలభై శాతం గాయాలయ్యాయి. ఆమె పడుకున్న మంచం సగం కాలిపోయింది. ఉదయం 10.40 గంటల ప్రాంతంలో పనిమనిషి రాణి నిర్మల ఉంటున్న ఫ్లాట్‌లోకి వెళ్ళింది. పొగ కనిపించడంతో అపార్ట్‌మెంట్‌ సూపర్‌వైజర్‌ రోహిత్‌కు, రిషేంద్ర భార్య అమూల్యకు సమాచారం అందించింది. 

వారు లోపలికి వెళ్ళిచూడగా నిర్మల అప్పటికే కాలిన గాయాలతో మృతి చెంది ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రిషేంద్ర ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios