బాలుడిపై వృద్ధుడి లైంగిక దాడి.. అరెస్ట్...
మైనర్ బాలుడిపై ఓ వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలుడు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ : హైదరాబాద్ : ఇటీవలి కాలంలో చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బాలురపై పెద్ద వయసు వ్యక్తులు దాడులకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా హైదరాబాదులో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఏడేళ్ల వయసున్న బాలుడి మీద 65 ఏళ్ల వయసున్న వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాదులోని బోరబండ డివిజన్ బ్రాహ్మణ వాడి బస్తీలో వెలుగు చూసింది.
ఈ బస్తీలో ఉండే సయ్యద్ రవూఫ్ అనే వృద్ధుడు అక్కడే కిరాణా షాప్ నడుపుతున్నాడు. గురువారం అతను నడుపుతున్నదుకాణానికి ఓ మూడవ తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలుడు సరుకులు కొనుక్కోవడానికి వచ్చాడు. ఆ బాలుడిపై రవూఫ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో కంగారు పడ్డ బాలుడు వెంటనే ఇంటికి పరిగెత్తి తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పాడు.
షాక్ అయిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, రవూఫ్ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదని గత కొంతకాలంగా చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బస్తీ వాసులు ఆరోపించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.