అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ద దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.
నల్గొండ : అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ద దంపతులు కొడుకుకు మరింత భారంగా మారకూడదని దారుణ నిర్ణయం తీసుకున్నారు. భార్యాభర్తలు కలిసి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం అడ్లూరు గ్రామానికి చెందిన చిలుకూరి నర్సయ్య(75)-లక్ష్మమ్మ(70) దంపతులకు ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు సంతానం. ముగ్గురికీ పెళ్లిళ్లు చేసిన దంపతులు పదెకరాల పొలాన్ని కౌలుకు ఇచ్చేసారు. ఇలా ఇంతకాలం కాయకష్టం చేసిన దంపతులు శేశజీవితాన్ని హాయిగా గడపాలని అనుకున్నారు. వారొకటి తలిస్తే విధి మరొకటి తలిచింది. అసలే వృద్దాప్యంతో బాధపడుతున్న నర్సయ్య పక్షవాతంతో, లక్ష్మమ్మ మూత్రపిండాల సమస్యతో మంచానపడ్డారు.
భార్యా పిల్లలతో హైదరాబాద్ లో స్థిరపడ్డ కొడుకు తల్లిదండ్రులను చూసుకునేందుకు వచ్చి వెళుతుండేవారు. అటు వ్యాపార పనులు చేసుకోడానికి హైదరాబాద్ లోనే వుండాల్సి రావడం... ఇటు తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతుంటే గ్రామానికి రావాల్సి వస్తుండటంతో అతడు నలిగిపోయాడు. ఇలా కొడుకు పరిస్థితి చూసి కన్నవారు మనోవేధనకు గురయ్యారు. తమ వల్లే కొడుకు అవస్థలు పడుతున్నాడని భావించిన వృద్ద దంపతులు దారుణ నిర్ణయం తీసుకున్నారు.
Read More తన చితి తానే పేర్చుకొని వృద్ధుడి ఆత్మహత్య.. వంతుల వారీగా కుమారుల దగ్గర ఉండటం ఇష్టం లేకే దారుణం..
దంపతులిద్దరూ రాత్రి ఆత్మహత్య చేసుకోగా ఉదయం చుట్టుపక్కల ఇళ్లవారు మృతదేహాలను గుర్తించారు. దీంతో వారి పిల్లలతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం వారి కుటుంబసభ్యులకు మృతదేహాలను అప్పగించగా అంత్యక్రియలు పూర్తిచేసారు.
(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)
