ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. సీబీఐ తనను ఇరికించాలని చూస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైకోర్టుకు తెలిపారు.
హైదరాబాద్ : గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి ఇనుప ఖనిజం తవ్వకాల కేటాయింపునకు సంబంధించిన ఫైలుపై సంతకం చేయడం ద్వారా తాను ఎలాంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందలేదని లేదా అలాంటి ప్రయోజనాలను డిమాండ్ చేయలేదని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రా రెడ్డి శుక్రవారం తెలంగాణ హైకోర్టుకు తెలిపారు.
“మైనింగ్ మంత్రిగా, ఏఎస్ఓ నుండి ప్రిన్సిపల్ సెక్రటరీ (మైనింగ్) వరకు అధికారులందరూ ఆమోదించిన తర్వాతే నేను ఫైలుపై సంతకం చేసానని” పి.సబితా ఇంద్రా రెడ్డి తన న్యాయవాది ద్వారా కోర్టుకు తెలిపింది. జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి ఇనుప ఖనిజం తవ్వకాల అనుమతుల కేటాయింపునకు సంబంధించి సీబీఐ 2012లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో తన పేరును తొలగించాలని ఆమె క్రిమినల్ రివిజన్ పిటిషన్‌లో పేర్కొంది.
అంతకుముందు, సిబిఐ కోర్టు ఆమె డిశ్చార్జ్ పిటిషన్‌ను తిరస్కరించింది, అందుకే మంత్రి రివిజన్ పిటిషన్‌ను దాఖలు చేశారు, దీనిని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ విచారించారు.
కృష్ణా జలాల వినియోగ వాటా ఖరారు చేయాలంటూ తెలంగాణ డిమాండ్.. ఏపీ ఏం చెబుతోందంటే ?
తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలను రుజువు చేయకుండానే ఓఎంసీకి మైనింగ్ లీజు కేటాయింపులో నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు సీబీఐ నిర్ధారణకు వచ్చిందన్నది ఆమె వాదన.
‘2007లో జారీ చేసిన అటువంటి కేటాయింపులకు సంబంధించిన రెండు జీఓలను ప్రభుత్వం కానీ, న్యాయవ్యవస్థ కానీ పక్కన పెట్టలేదు. కోర్టు కూడా చెప్పిన జిఓలను తప్పు పట్టలేదు. కానీ, ఒక్క ఆధారం కూడా లేకుండా నాపై సీబీఐ ఆరోపణలు చేస్తోంది’ అని ఆమె వాదించారు. మంత్రి వాదనల మీద సీబీఐ సమాధానం కోసం హైకోర్టు కేసును ఫిబ్రవరి 25కి వాయిదా వేసింది.
