హైదరాబాద్: తెలంగాణకు రాష్ట్ర గీతం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.

బుధవారం నాడు అసెంబ్లీలో గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే చర్చకు ఆయన సమాధానమిచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తన ప్రసంగంలో రాష్ట్ర గీతం గురించి ప్రస్తావించారు.

రాష్ట్రానికి ప్రత్యేక గీతం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర గీతంగా ఏ గీతాన్ని కూడ గుర్తించలేదన్నారు.  తెలంగాణ ఉద్యమ కాలంలో జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఉద్యమకారులు ప్రచారం చేశారు.

రాష్ట్రంలో టీఆర్ఎస్  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం గురించి చర్చసాగింది. ఇదే విషయమై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు లేవనెత్తారు.

మరోవైపు గంధమళ్ల, మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు పరిహారం గురించి రఘునందన్ రావు ప్రశ్నకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు. పట్టణాల్లో, గ్రామాల్లో నిర్వాసితులకు ఇచ్చే పరిహరంలో తేడా ఉంటుందన్నారు.

గంధమళ్ల రిజర్వాయర్ నిర్మాణం విషయమై అన్ని పార్టీలు ఆందోళనలు చేశారన్నారు. మల్లన్నసాగర్ ను అడ్డుకొనేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు అనేక కేసులు వేశారన్నారు.గంధమళ్ల నిర్వాసితులకు గజ్వేల్ పక్కనే 7 వేల ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు.