నో హెల్మెట్.. నో పెట్రోల్

No fuel without helmet in Telangana
Highlights

హెల్మెట్‌ ధరించని వినియోగదారులకు పెట్రోల్‌ విక్రయించమని తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ వినయ్‌కుమార్‌సింగ్‌ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు

ద్విచక్రవాహనదారులంతా తప్పక.. హెల్మెట్ ధరించాలని ప్రభుత్వం, ట్రాఫిక్ పోలీసులు ఎంత మొత్తుకున్నా పాటించేవారు నామమాత్రమే. ఛలానాలు విధించినా కూడా చాలా మంది ఖతరు చేయడం లేదు. దీంతో.. తాజాగా.. తెలంగాణలోని వాహనదారులకు ఓ కొత్త మెలిక పెట్టారు. హెల్మెట్ లేని వారికి పెట్రోల్ అమ్మకూడదనే నిబంధనను అమలులోకి తీసుకువస్తున్నారు.

హెల్మెట్‌ ధరించని వినియోగదారులకు పెట్రోల్‌ విక్రయించమని తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ వినయ్‌కుమార్‌సింగ్‌ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సామాజిక బాధ్యతగా నేరాలను అదుపు చేయడంలో జైళ్ల శాఖ కీలకపాత్రం పోషించిందని, అదే విధంగా విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పించిందన్నారు. ఇటీవలకాలంలో రోడ్డు ప్రమాదాల బారినపడిన వారు అత్యధికంగా హెల్మెట్‌ ధరించకపోవడంతో మరణిస్తున్నట్లు దినపత్రికల ద్వారా తెలుసుకున్నట్లు తెలిపారు.

దీంతో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 13 పెట్రోల్‌ బంకులు, నూతనంగా నిర్మించబోయే మరో 8 పెట్రోల్‌ బంకుల్లో హెల్మెట్‌ ధరించని వినియోగదారులకు విక్రయాలు జరపకుండా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జైళ్ల శాఖ సరఫరా చేస్తున్న నాణ్యమైన పెట్రోల్‌ కోసం ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ ధరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇతర ప్రైవేటు పెట్రోల్‌ బంకుల యజమానులు కూడా ఇలాంటి నిర్ణయం తీసు కుంటే మరణాలు తగ్గే అవకాశం ఉందని తెలిపా రు. బంకుల ద్వారా లాభార్జనే కాకుండా మంచి లక్ష్యాల కోసం జైళ్ల శాఖ పనిచేస్తుందన్నారు.

loader