జూనియర్ పంచాయితీ సెక్రటరీలను చర్చలకు పిలవలేదు:ఎర్రబెల్లి దయాకర్ రావు
జూనియర్ పంచాయితీ సెక్రటరీలను చర్చలకు పిలవలేదని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.
హైదరాబాద్: జూనియర్ పంచాయితీ సెక్రటరీలను ప్రభుత్వం చర్చలకు పిలిచిందన్న ప్రచారం నిజం కాదని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.గురువారంనాడు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ విషయమై స్పందించారు. నిబంధనలకు విరుద్దంగా జూనియర్ పంచాయితీ సెక్రటరీల సమ్మె విరుద్దమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.
ఇప్పటికైనా సమ్మెను విరమించాలని మంత్రి దయాకరా్ రావు కోరారు. జూనియర్ పంచాయితీ సెక్రటరీలపై సీఎం కేసీఆర్ కు మంచి అభిప్రాయం ఉందన్నారు. ఈ అభిప్రాయాన్ని చెడగొట్టుకోవద్దని కోరారు. ప్రభుత్వాన్ని నియంత్రించాలనుకోవడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమ్మెను విరమించాలని ఆయన జేపీఎస్ లను సూచించారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి కూడా విరుద్ధమని మంత్రి చెప్పారు. యూనియన్లు, సంఘాలు ఏర్పాటు చేసుకోబోమని జేపీఎస్ లు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారని మంత్రి గుర్తు చేశారు. ఈ ఒప్పందాన్ని జూనియర్ పంచాయితీ సెక్రటరీలు ఉల్లంఘిస్తున్నారని మంత్రి విమర్శించారు. ఫోన్ లో తనతో మాట్లాడి సమస్యలు చెప్పుకున్నారని మంత్రి గుర్తు చేశారు. కానీ చర్చలకు పిలిచినట్టుగా ప్రచారం చేసుకోవడం అర్ధరహితమన్నారు.