ఈటలతో నాకు విభేదాలు లేవు: తేల్చేసిన జితేందర్ రెడ్డి
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో తనకు విభేదాలు లేవని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చెప్పారు. తామిద్దరం తెలంగాణ ఉద్యమంలో కలిసి పని చేశామన్నారు.
హైదరాబాద్:మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి చెప్పారు.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో లంచ్ భేటీ ముగిసిన తర్వాత ఎంపీ జితేందర్ రెడ్డి హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. సోమవారంనాడు మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో సమావేశమయ్యారు.
ఈటల రాజేందర్, తాను తెలంగాణ ఉద్యమ కాలం నుండి సహచరులమని ఆయన గుర్తు చేసుకున్నారు. పార్లమెంట్ లో తాను బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గా ఉన్న సమయంలో ఆర్ధిక మంత్రిగా ఉన్న రాజేందర్ న్యూఢిల్లీకి వస్తే తన ఫ్లాట్ లోనే ఉండేవారని ఆయన మీడియాకు తెలిపారు. ఈటల రాజేందర్ తో తనకు విబేధాలు ఎందుకు ఉంటాయని ఆయన మీడియాను ప్రశ్నించారు.
తనది పాలమూరని, ఈటల రాజేందర్ ది హుజూరాబాద్ అని ఆయన చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలకు తాను ఇంచార్జీగా ఉండి ఈటల రాజేందర్ ను గెలిపించిన విషయాన్ని జితేందర్ రెడ్డి ప్రస్తావించారు. అంతా కలిసి పనిచేసే సంప్రదాయం బీజేపీలో ఉందన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర నేతలకు ఎవరికి పదవులు వచ్చినా మంచిదేనని జితేందర్ రెడ్డి చెప్పారు. తన ట్వీట్ ను ఎలా అర్ధం చేసుకుంటారో అర్ధం చేసుకోవాలన్నారు.ట్వీట్ కు వివరణలు ఇవ్వడం ఉందన్నారు. తన ట్వీట్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు చేసినట్టుగా తనకు అనిపించలేదన్నారు.
also read:న్యూఢిల్లీకి బండి సంజయ్: జితేందర్ రెడ్డితో ఈటల లంచ్ భేటీ
తనకు ఢిల్లీలో పని లేదన్నారు. అందుకే తాను ఢిల్లీకి వెళ్లడం లేదని జితేందర్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ గిమ్మిక్కులకు బీజేపీ భయపడదన్నారు. బీజేపీపై వదంతులను వ్యాపింపచేయడం ఆపాలని ఆయన మీడియాను కోరారు.