మరో రెండు రోజుల్లో వారి ఇంట శుభాకార్యం జరగాల్సి ఉంది. బంధుమిత్రుల ఆనందాలతో సందడిగా సాగాల్సిన ఇళ్లు... శోక సంద్రంగా మారింది. పనిమీద బయటకు వెళ్లి.. తెలిసినవారు కనిపిస్తే పలకరించారు. అదే వారి పట్ల శాపంగా మారింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలో చోటుచేసుకుంది.

Also Read స్నేహితుడి భార్యతో అసభ్య ప్రవర్తన... మందలించాడని.....

పూర్తి వివరాల్లోకి వెళితే... డిచ్ పల్లి మండలం మెంట్రాజ్ పల్లికి చెందిన జియ్య సుమన్(19) కి ఓ సోదరి ఉంది. ఆమెకు ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. మరో రెండు రోజుల్లో ఆమె పెళ్లి జరగాల్సి ఉంది. కాగా పెళ్లి వేడుకల్లో భాగంగా.. కామారెడ్డి జిల్లా తడ్వాయిలో ఉంటున్న మేనత్త రాజవ్వ(36) ఆమె కుమార్తె  దుర్గా వేణి(12) లను తన ఇంటికి తీసుకువచ్చేందుకు సుమన్ వెళ్లాడు.

వారిని తీసుకొని వస్తుండగా.. తిరుగు ప్రయాణంలో డిచ్ పల్లి మండలం సుద్దపల్లి వద్ద తెలిసినవారు కనిపించారు. వారి బైక్ తో సమానంగా పక్కనే వెళ్తుూ మాట్లాడుతూ సుమన్ బండి నడిపాడు. అనుకోకుండా రెండు బైక్ లు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో సుమన్, అతని మేనత్త, ఆమె కుమార్తె బైక్ మీద నుంచి కింద పడ్డారు.

అదే సమయంలో అటుగా ఓ లారీ రావడంతో..వారి మీద నుంచి దూసుకుపోయింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురి శరీరభాగాలు నుజ్జునుజ్జు అయ్యాయని పోలీసులు చెబుతున్నారు. కాగా... పెళ్లి జరగాల్సిన ఇంట చావు జరిగిందంటూ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.