నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ సాగుతోంది.

ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై అనర్హత వేటు పడడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.టీఆర్ఎస్ నుండి సీఎం కేసీఆర్ కూతురు కవిత, కాంగ్రెస్ నుండి సుభాష్ రెడ్డి, బీజేపీ నుండి యెండల లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు.

also read:నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కరోనా సెగ: 24 మంది ఓటర్లకు కోవిడ్

జిల్లాలోని 824 మంది ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లా వ్యాప్తంగా 50 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనే ఓటర్లు (ప్రజా ప్రతినిధులు) 24 మందికి కరోనా సోకింది. వీరిని పోలింగ్ కు చివరి గంటలో ఓటు హక్కును వినియోగించుకొనేలా అధికారులు చర్యలు తీసుకొన్నారు.

బాన్సువాడలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకొన్నారు.
ఈ నెల 12వ తేదీన ఓట్లను లెక్కించనున్నారు.ఈ ఎన్నికల్లో విజయం కోసం టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు ప్రయత్నిస్తున్నాయి. ఈ మూడు పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి.