ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు.. సెక్యురిటీ తప్పనిసరి. వాళ్లు ఎక్కడకు వెళ్లినా... వారి కోసం ప్రత్యేకంగా ఓ వాహనం... అందులో సెక్యురిటీ సిబ్బంది ఉండటం సర్వసాధారణం. అయితే.... ఓ జిల్లా కలెక్టర్ మాత్రం సర్వసాధారణంగా వ్యవహరించారు. నిజామాబాద్ జిల్లా కొత్త కలెక్టర్ నారాయణరెడ్డి రెండు రోజుల క్రితమే విధుల్లో చేరారు.

కాగా... ఆయన శుక్రవారం ఉదయం సాధారణ వ్యక్తిలో సైకిల్ పై జిల్లా ఆస్పత్రికి వెళ్లారు. రోగులు, వారి బంధువులతో మాట్లాడి వైద్య సేవల తీరుపై ఆరాతీశారు. ఓ రోగిని ఎవరూ పట్టించుకోకుంటే అతడికి వైద్యం అందించేందుకు ప్రయత్నించారు. ఆయన మాటలను అక్కడి వైద్యులు పట్టించుకోలేదు. చివరకు తాను జిల్లా కలెక్టర్ అని చెప్పడంతో... వైద్యులంతా కంగారు పడిపోయారు.

వెంటనే ఉరుకుల పరుగులతో ఆ రోగికి వైద్యం అందించారు. అనంతరం ఆయన ఆస్పత్రి సిబ్బందికి సంబంధించిన బయోమెట్రిక్ ని పరిశీలించారు. వైద్యులు, ఉద్యోగులు మొత్తం 210 మంది విధులు నిర్వర్తించాల్సి ఉండగా... వారిలో 111 మంది హాజరు కాలేదన్న విషయం గుర్తదించారు. ఈ 111 మందికి కలెక్టరేట్ నుంచి మెమోలు పంపించనున్నట్లు నారాయణ రెడ్డి చెప్పారు.

ఆ తర్వాత కాన్పుల వార్డులోకి వెళ్లి బాలింతలను,   చిన్నారులను పరామర్శించారు. ఆస్పత్రిని రోజుకు ఎన్నిసార్లు శుభ్రం చేస్తారని అడిగారు. మంచినీటిని అధిక ధరకు విక్రయిస్తున్న వ్యక్తిపై క్రిమినల్ కేసు పెట్టాలని ఆస్పత్రి అధికారులను ఆదేశించారు.