హైదరాబాద్: ఓ మహిళ తన తొమ్మిదో భర్త చేతిలో హతమైంది. ఇతర వ్యక్తులను పరిచయం చేసుకుని వారితో సన్నిహితంగా మెలుగుతుండడాన్ని సహించలేక అతను ఆమెను చంపేశాడు. తాను మందలించినా వినకపోవడంతో అతను ఆమె గొంతు కోసి చంపేశాడు. ఈ సంఘటన హైదరాబాదులోని పహడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. 

ఈ కేసుకు సంబంధించిన వివరాలను పహడీషరీఫ్ ఎస్సై కుమారస్వామి వివరించారు. మహిళకు అంతకు ముందు 8 పెళ్లళ్లు జరిగాయి. నిందితుడు ఆమెకు తొమ్మిదో భర్త. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందిన నాగరాజు మూడేళ్లుగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జల్ పల్లి మున్సిపల్ పరిధిలో గల శ్రీరామకాలనీలో నివాసం ఉంటున్నాడు. క్యాబ్ డ్రైవర్ అయిన నాగరాజుకు స్థానికంగా ఉండే వరలక్ష్మి (30)తో పరిచయమైంది. 

వరలక్ష్మి కాటేదాన్ ప్రాంతంలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తుంది. అప్పటికే ఆమెకు భర్త, కుమారుడు ఉన్నారు. నాగరాజు, వరలక్ష్మి మధ్య పరిచయం ప్రేమగా మారింది. దాంతో వరలక్ష్మి రెండేళ్ల క్రితం భర్తను వదిలేసి నాగరాజును పెళ్లి చేసుకుంది. కొద్ది రోజులు అంతా సజావుగానే సాగింది. అయితే, తర్వాత ఆమె కొత్త వ్యక్తులతో సన్నిహితంగా మెలగడాన్ని నాగరాజు పసిగట్టాడు. దాంతో ఇరువురి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. 

మూడు రోజుల క్రితం వారి మధ్య మరోసారి గొడవ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున కూడా గొడవ జరిగింది. గొడవలో తీవ్ర ఆగ్రహానికి గురైన నాగరాజు వరలక్ష్మి గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత పహడీషరీఫ్ పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. భర్తలతో గొడవ పడి విడిపోయి మరొకరిని పెళ్లి చేసుకుంటూ వస్తోందని వరలక్ష్మి గురించి ఎస్సై చెప్పాడు.