దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలోనూ విద్యాసంస్థల్లో కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి.
మహబూబాబాద్ : తెలంగాణలో కరోనా కలకలం రేగింది. దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభణ మొదలవగా తెలంగాణలోనూ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలోని ఓ బాలికల గురుకుల విద్యాలయంలో 9మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై మళ్ళీ కరోనా నియంత్రణ చర్యలు చేపట్టింది.
తొర్రూరులోని బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్లో వుంటున్న స్కూల్, కాలేజీ విద్యార్థినులకు ఎప్పటిలాగే కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే తొమ్మిదిమంది అమ్మాయిలకు కరోనా పాజిటివ్ గా తేలడంతో కలకలం మొదలయ్యింది. కరోనా సోకిన విద్యార్థినులకు ఇంటికి పంపించి క్వారంటైన్ లో వుంచామన్నారు. ప్రస్తుతం కరోనా సోకిన విద్యార్థినులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని... తల్లిదండ్రులు కంగారు పడవద్దని విద్యా, వైద్య శాఖల అధికారులు పేర్కొన్నారు.
గురుకుల బాలికలకు కరోనా సోకినట్లు తెలియగానే మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మహబూబాబాద్ అధికారులను అప్రమత్తం చేసారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్, వైద్యాధికారి, ఆర్డివో, సంబంధిత స్కూల్, కాలేజి ప్రిన్సిపాల్స్, ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులు, వైద్యాధికారులు తదితరులతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వ్యాప్తి జరక్కుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించిన మంత్రి విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
Read more కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నయ్.. ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ఇలా చేయాల్సిందే..!
ఈ సందర్భంగా మంత్రి కరోనా బారినపడ్డ విద్యార్థినులకు ధైర్యం చెప్పారు. కరోనా తీవ్రత చాలా తగ్గిందని... భయపడాల్సిన పని లేదని అన్నారు. విద్యార్థినులు ధైర్యంగా వుండాలని... తగిన చికిత్స అందుబాటులో వుంటుందన్నారు. బూస్టుర్ డోసులు ఇవ్వడంతో పాటు అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. కరోనా సోకితే జాగ్రత్త అవసరం... అంతేగానీ భయపడాల్సిందేమీ లేదని ఎర్రబెల్లి ధైర్యం చెప్పారు.
తొర్రూరులోని ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థినులకు రాపిడ్ పరీక్షలు నిర్వహించగా 9మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని...వారికి మెరుగైన చికిత్స అందిస్తామని మంత్రి తెలిపారు. కరోనా కేసులు బయటపడ్డ నేపథ్యలో మిగతా పిల్లలకు కూడా పరీక్షలు నిర్వహించామని... వాళ్ళందరూ ఆరోగ్యంగానే ఉన్నారన్నారు. కరోనా విస్తరణ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై అధికారులకు మంత్రి ఎర్రబెల్లి దిశానిర్దేశం చేశారు.
ఇక ఇటీవల మహబూబ్ నగర్ లోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. హాస్టల్లోని కొందరు విద్యార్థులు జలుబు, దగ్గు, జ్వరం వంటి కరోనా లక్షణాలతో బాధపడటంతో వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించారు, ఇందులో 15 మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యాంది. దీంతో వారిని ఐసోలేషన్ లో వుంచి మెరుగైన చికిత్స అందించారు.
ఇలా జిల్లాలో గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులు కరోనాబారిన పడటం తల్లిదండ్రులను కంగారు పెడుతోంది. పరీక్షల సమయంలో విద్యార్థులను ఇళ్లను తీసుకుని వెళ్లలేక... హాస్టల్లో వుంచలేక మదనపడుతున్నారు. అయితే కరోనాకు భయపడాల్సిన పని లేదని... నియంత్రణలోనే వుందని వైద్యాధికారులు ధైర్యం చెబుతున్నారు.
