నేరెళ్ల ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్ ఆగ్రహం నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని డిజిపి కి ఆదేశం ఇటీవల కాంగ్రెస్ ఫిర్యాదుపై స్పదించిన ఎన్ హెచ్ఆర్ సి

తెలంగాణ సర్కారుకు సిరిసిల్ల నేరెళ్ల ఉచ్చు మరింత బిగిసే అవకాశాలున్నాయి. సిరిసిల్లలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలు బలంగా వినిస్తున్నాయి. అలాగే దళితుల ఆత్మగౌరవం దెబ్బతీసే రీతిలో పోలీసులు వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఈ ఘటనలో ఇప్పటికే ఒక ఎస్సైని సర్కారు సస్పెండ్ చేసింది. కేవలం ఎస్సై సస్పెన్షన్ తోనే సరిపెడతారా? లేక అసలు సూత్రదారి ఎస్పీ వరకు వేటు పడుతుందా అన్న చర్చ సాగుతున్నది. ఎస్పీపై వేటు వేయాలని ప్రతిపక్షాలు ఆందోళన కంటిన్యూ చేస్తున్నాయి.

సిరిసిల్లలో భయంకరమైన ఇసుక మాఫియా రాజ్యమేలుతున్నది. ఇసుక లారీలు ఓవర్ లోడ్ తో వెళ్లడం, ఓవర్ స్పీడ్ తో వెళ్లడంతో అక్కడ గత కొంతకాలంగా సుమారు పది మంది వరకు ప్రాణాలను బలికొన్నాయి ఇసుక లారీలు. దీంతో నేరెళ్ల వాసులు ఆగ్రహానికి లోనై ఇసుక లారీలను కాలబెట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ప్రాణం లేని ఇసుక లారీలను కాలబెట్టినందుకు ప్రాణమున్న మనుషులను చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఇసుక మాఫియా మంత్రి కెటిఆర్ అండదండలతో, సిఎం కుటుంబ సభ్యలే నడుపుతున్నారన్న ఆరోపణలు గుప్పిస్తున్నాయి విపక్షాలు.

ఈ నేపథ్యంలో నేరెళ్ల పోలీసు దాడులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరెళ్లలో ఏం జరిగిందో వాస్తవాలు తెలియజేయాలంటూ తెలంగాణ రాష్ట్ర డిజిపి కి ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా నివేదిక అందజేయాలని ఆదేశించింది మానవ హక్కుల కమిషన్. డిజిపి నివేదిక అందిన తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు.

సిరిసిల్ల ఘటనపై కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఆందోళనను తీవ్రతరం చేసిన విషయం తెలిసేందే. కేంద్ర మానవ హక్కుల సంఘానికి, ఎస్సీ కమిషన్ కు ఇప్పటికే కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర మానవ హక్కుల కమిషన్ తెలంగాణ పోలీసు బాసుకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

మరి పోలీసు బాసు ఎలాంటి నివేదిక ఇస్తాడన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. కోర్టులోనే పోలీసులు గమ్మత్తయిన నివేదిక ఇచ్చారు. నేరెళ్ల బాదితులను తాము కొట్టలేదని, గతంలోనే వాళ్లు గాయపడ్డారంటూ చిత్రమైన నివేదికను అందజేశారు. వాళ్లకు వాళ్లే కొట్టుకుని గాయపరుచుకున్నారు తప్ప పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదన్న కోణంలో కోర్టులో రికార్డు సబ్ మిట్ చేశారు.

మరి ఆ తర్వాత సీన్ మారిపోయింది. ఒక ఎస్సైని సర్కారు నిందితుడిగా నమ్ముతూ వేటేసింది. మరి ఇప్పుడు ఎన్.హెచ్.ఆర్.సి కి డిజిపి నివేదిక ఏమని ఇస్తారన్నది చూడాల్సి ఉంది.