హైదరాబాద్: నిందితుల ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్సీ) విచారణ చేపట్టడంపై దిశ కుటుంబ సభ్యులు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కూతురు మరణించినప్పుడు ఎన్ హెచ్ఆర్సీ ఎందుకు మాట్లాడలేదని వారు ప్రశ్నించారు. అప్పుడు ఎందుకు పర్యటన చేయలేదని అడిగారు.

తమ కూతురు కేసులోని నిందితులను చంపేయాలని పౌర సమాజం కోరుకుందని వారు అంటున్నారు. నేరస్థులు చనిపోతే హక్కుల ఉల్లంఘన అవుతుందా అని వారు ప్రశ్నించారు. దిశ రేప్, హత్య కేసులోని నిందితుల ఎన్ కౌంటర్ మీద ఎన్ హెచ్ఆర్సీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.

Also Read: Disha case accused encounter: పవన్ కల్యాణ్ కు 101 కొబ్బరికాయలు

తమ విచారణలో భాగంగా ఎన్ హెచ్ఆర్సీ సభ్యులు శనివారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగిన చటాన్ పల్లి ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ తర్వాత నిందితుల మృతదేహాలను భద్రపరిచిన మహబూబ్ నగర్ ఆస్పత్రిని కూడా వారు సందర్శించారు. అనంతరం నిందితుల స్వగ్రామంలో కూడా వారు పర్యటించే అవకాశం ఉంది. 

దిశ రేప్, హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై ఓ వర్గం పెద్ద యెత్తున హర్షాతిరేకాలు వ్యకమవుతుండగా, దానికి నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎన్ కౌంటర్ విషయంలో పోలీసులపై కొద్ది మంది న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేశారు. ఎన్ కౌంటర్ విషయంలో పోలీసులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను విస్మరించారని వారు ఆరోపించారు.

Also Read: దిశ నిందితుల ఎన్ కౌంటర్.... సజ్జనార్ ఫోన్ కి కాల్స్ వర్షం

నిందితుడు చెన్నకేశవులు భార్య ఆందోళనకు దిగింది. తన భర్తను తనకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు కూడా దిగింది. నిందితుల కుటుంబాల నిరసనకు స్థానికుల మద్దతు కూడా లభిస్తోంది.