ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టింది. కానీ ఆ ఆశలన్నీ అడియాశలుగానే మారిపోయాయి. కనీసం కాళ్లకు రాసిన పారాణి కూడా ఆరకముందే.. పాడెక్కాల్సి వచ్చింది. దీనంతంటికీ.. అత్తారింట్లో వరకట్న వేధింపులే కారణ కావడం గమనార్హం. వరకట్న వేధింపులు తట్టుకోలేక ఓ నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తది వివరాలు ఇలా ఉన్నాయి.

పెద్దపల్లి జిల్లా  రామగిరి మండలం రత్నాపూర్ గ్రామానికి చెందిన శ్రీవాణి.. జూలపల్లి మండలం పెద్దపూర్ గ్రామానికి చెందిన మహేష్ ని ప్రేమించింది. వీరిద్దరూ దాదాపు రెండు సంవత్సరాల పాటు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం కావడంతో.. పెళ్లికి పెద్దలు కూడా ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. దీంతో.. గతేడాది నవంబర్ లో వీరి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

ప్రేమించిన వాడిని పెళ్లాడినందుకు శ్రీవాణి ఎంతో మురిసిపోయింది. కానీ.. అత్తారింటికి వెళ్లాక తాను ఊహించినట్లు ఏదీ జరగడం లేదని తెలిసి బాధపడింది. అత్త, భర్త కలిసి ఎంత హింసించినా భరిస్తూ వచ్చింది. అదనపు కట్నం కావాలంటూ వారు పెడుతున్న బాధలు రోజు రోజుకీ పెరిగిపోయాయి.

పెళ్లి సమయంలో పది లక్షల రూపాయల కట్నం ఇచ్చినప్పటికీ.. మరింత కావాలని ఒత్తిడి చేయడం గమనార్హం. ఈ బాధలు భరించలేక.. శ్రీవాణి బలవన్మరణానికి పాల్పడింది. భర్త, అత్త వేధింపుల కారణంగానే యువతి చనిపోయిందని.. ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా..పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.