పెళ్లయిన వారం రోజులకే ఓ నవ వధువు ఆదృశ్యమైంది. వివరాల్లోకి వెళితే... మేడ్చల్ మండలం కండ్లకోయ గ్రామానికి చెందిన యాదమ్మ, నర్సింహ దంపతుల కుమార్తె దివ్య.. ఆమెకు ఈ నెల 22న మెదక్ జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామానికి చెందిన మహేశ్‌తో వివాహం జరిగింది.

పెళ్లి అనంతరం కార్యక్రమాలు సైతం పూర్తికావడంతో ఈ నెల 27న దివ్య తన భర్తతో కలిసి కండ్లకోయలోని పుట్టింటికి వచ్చింది. ఆ సమయంలో ఆమె తల్లి యాదమ్మ పనులకు వెళ్లిపోయింది.

దివ్య తన భర్త మహేశ్‌తో పాటు తండ్రికి భోజనాన్ని వడ్డించి తాను తినింది. సాయంత్రం తల్లి యాదమ్మ విధులు ముగించుకుని ఇంటికి చేరుకుంది.. 28 ఉదయం యాదమ్మ మరోసారి డ్యూటీకి వెళ్లిపోయింది.

అయితే తనకు ఆదాయ సర్టిఫికెట్ కావాలని తండ్రిని దివ్య బయటికి పంపించింది. ఇంట్లో ఉన్న భర్త మహేశ్ నిద్రిస్తున్నాడు.. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయింది.

విషయం గమనించిన కుటుంబీకులు దివ్య ఆచూకీ కోసం బంధువుల ఇళ్లలోనూ, స్థానికంగా వెతికి చూశారు. ఆమె జాడ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.