తెలంగాణలో కొత్త జోన్లు ఇవే : కేసిఆర్ నిర్ణయం

new zones and multi zones in telangana
Highlights

జోన్ల పెంపు నిరుద్యోగులకు మంచిదేనా ?

తెలంగాణ రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి  కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వివరాలివి.

 

జోన్ల వివరాలు:

1.      కాళేశ్వరం జోన్ (28.29 లక్షల జనాభా): భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి

2.     బాసర జోన్ (39.74 లక్షల జనాభా): ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల

3.     రాజన్న జోన్ (43.09 లక్షల జనాభా): కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్

4.     భద్రాద్రి జోన్ (50.44 లక్షల జనాభా): కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్

5.     యాదాద్రి జోన్ (45.23లక్షల జనాభా): సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ

6.     చార్మినార్ జోన్(1.03 కోట్ల జనాభా): హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి

7.     జోగులాంబ జోన్ (44.63 లక్షల జనాభా): మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, వికారాబాద్

 

మల్టీ జోన్లు:

1.      కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి (1.61 కోట్ల జనాభా)

2.     యాదాద్రి, చార్మినార్, జోగులాంబ (1.88 కోట్ల జనాభా)

ప్రగతి భవన్ లో జోనల్ విధానం పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి  కేసీఆర్ నిర్ణయించారు.

తెలంగాణ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా, గతంలో జరిగిన అన్యాయం పునరావృతం అయ్యే అవకాశం లేకుండా జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు సిఎం కేసీఆర్ ప్రకటించారు. చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకున్నందున ఆయా ప్రాంతాల్లో ఉండే స్థానికులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం నిర్ణయం ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, ఆ తర్వాత రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరగడంతో జోన్ల వ్యవస్థను కూడా పునర్విభజించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలోని 31 జిల్లాలను వివిధ జోన్లు, మల్టీ జోన్లుగా విభజించిన అంశాన్ని ఉద్యోగులకు తెలియచేయడంతో పాటు ఇతర అంశాలు చర్చించడానికి శుక్రవారం టిజివో భవన్ లో సమావేశం జరపాలన్నారు. ఉద్యోగుల  సమావేశం తర్వాత వారి అభిప్రాయాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక ద్వారా అందజేయాలని సూచించారు. జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థకు కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే కేంద్రానికి పంపనున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని తానే స్వయంగా పర్యవేక్షించి, తెలంగాణలో కొత్త జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థ అమల్లోకి తీసుకొస్తామని కేసిఆర్ స్పష్టం చేశారు.

loader