Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ రెడ్డి గురించి మరో కొత్త ముచ్చట

  • రేవంత్ పార్టీ మార్పుపై కొత్త ప్రచారం
  • రాహుల్ సమక్షంలోనే కాంగ్రెస్ తీర్థం
  • నల్లగొండ బరిలో కాంగ్రెస్ తరుపునే పోటీ 
new twist to revanth reddys nalgonda story

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి గురించి తాజాగా కొత్త ముచ్చట వినిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ కామెంట్లతో రేవంత్ రెడ్డి అనునిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ సిఎం కేసిఆర్ మీద రేవంత్ రెడ్డి ఘాటైన కామెంట్లతో విరుచుకుపడుతుంటారు. రేవంత్ వ్యాఖ్యలు ఎంత ఘాటుగా ఉంటాయో పక్కనపెడితే టిఆర్ఎస్ నేతలు ఆయన మాటలను పట్టించుకోవద్దని నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా వచ్చింది.

ఇక తాజా పరిస్థితికి వస్తే తెలంగాణలో టిడిపి, టిఆర్ఎస్ కలిసి పోటీ చేసే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమైపోయిందని చెబుతున్నారు. జనవరి అటు ఇటుగానే రేవంత్ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరడంతోపాటు వెనువెంటనే నల్లగొండ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ తరుపున రేవంత్ పోటీ చేయబోతున్నారన్న ప్రచారం జోరందుకున్నది.

నిజానికి రేవంత్ రెడ్డి నల్లగొండ పార్లమెంటుకు సై అని ఎప్పటి నుంచో అంటున్నారు. టిడిపిలోని ఒక వర్గం కూడా రేవంత్ ను నల్లగొండ పార్లమెంటులో బరిలోకి దింపాలని వాదిస్తూ వచ్చింది. అయినా అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని కూడా అందరూ టిడిపి నేతలు అనుకొచ్చారు. కానీ తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణ సిఎం కేసిఆర్ అనంతపురం పర్యటన తర్వాత స్పీడ్ మరింత పెరిగింది. ఈ తరుణంలో టిడిపి, టిఆర్ఎస్ మధ్య ఫ్రెండ్లీ రిలేషన్ పెరిగిన వాతావరణం ఉంది. దీంతో అంతే వేగంగా రేవంత్ శిబిరం కూడా పావులు కదుపుతోంది.

నెల రోజుల్లో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఆలోగా నల్లగొండ ఎన్నిక పైనా, టిడిపి, టిఆర్ఎస్ పొత్తులపైనా ఒక క్లారిటీ వస్తే రాహుల్ సమక్షంలోనే రేవంత్ ను కాంగ్రెస్ లో చేర్పించుకునేందుకు కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. నల్లగొండ ఎన్నిక విషయంలో టిఆర్ఎస్ పార్టీ ఇంకా ఎటూ తేల్చని వాతావరణం ఉంది. మరోవైపు టిడిపి నేతలు కూడా పొత్తుల విషయంలో ఏం మాట్లాడొద్దని, ఎన్నికలనాటికి పరిశీలించాలని అనుకున్నారు. కానీ తెరవెనుక జరగాల్సిన పరిణామాలన్నీ చకచకా జరిగిపోతున్నాయి. పైకి మాత్రం మేడిపండు చందంగా ఉన్నప్పటికీ లోలోపల మాత్రం ఎవరికి వారు అంచనాలు, లెక్కల్లో మునిగిపోతున్నారు. ఏ క్షణమైనా తమకు అనుకూలంగా అనుకున్న వైపు టర్న్ కావడానికి సమాయత్తం అవుతున్నారు.

ఏది ఏమైనా జనవరి, ఫిబ్రవరి నాటికి తెలంగాణ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులొస్తాయని రేవంత్ రెడ్డి శిబిరంలోని నాయకులు మాత్రం చెబుతున్నారు. అది వారంతా గుండుగుత్తగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడమా? లేక ఇంకోరకమైన పరిణామాలు జరుగుతాయా అన్నది వారు స్పష్టం చేయడేంలేదు. ఇవన్నీ జరిగి రేవంత్ నల్లగొండ బరిలో దిగితే ఇటు రేవంత్ భవతవ్యం, అటు కాంగ్రెస్ భవిష్యత్తు రెండూ తేలిపోయే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి

https://goo.gl/fJWa5i

 

Follow Us:
Download App:
  • android
  • ios