పేపర్ లీక్ కేసులో ట్విస్ట్ .. మాది కూడా లీకైంది, పరీక్షను రద్దు చేయండి : సీడీపీవో అండ్ ఈవో అభ్యర్ధులు
టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద సీడీపీవో అండ్ ఈవో అభ్యర్ధులు ఆందోనకు దిగారు. తమ పేపర్ కూడా లీకైందని, తమ పరీక్ష కూడా రద్దు చేసి తిరిగి నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఘటనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. సీడీపీవో అండ్ ఈవో పేపర్ లీకైందని మహిళా అభ్యర్ధులు ఆందోళనకు దిగారు. 46 వేల మంది మహిళలకు అన్యాయం జరుగుతుందని.. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కాగా.. పేపర్ లీక్ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జరిగిన పరీక్షలు సహా మొత్తం గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. జూన్ 11న మళ్లీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏవో పరీక్షలు రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఏఈఈ, డీఏవో పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. గతేడాది అక్టోబర్ 16న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇవి కాకుండా త్వరలో నిర్వహించాల్సి వున్న మరిన్ని పరీక్షలను వాయిదా వేసే యోచనలో కమీషన్ వుంది.
ALso Read: పేపర్ లీక్.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు , ఇక ప్రభుత్వోద్యోగం రాదన్న బాధతో యువకుడు ఆత్మహత్య
ఇదిలావుండగా.. పేపర్ లీక్ ఘటనకు సంబంధించి కమీషన్‌కు సిట్ నివేదిక అందజేసింది. ఈ కేసులో కీలక సూత్రధారి రాజశేఖరేనని.. అతను ఉద్దేశపూర్వకంగానే డిప్యూటేషన్‌పై టీఎస్‌పీఎస్సీకి వచ్చినట్లు సిట్ నిర్ధారించింది. ఇతను టెక్నికల్ సర్వీస్ నంచి డిప్యూటేషన్‌పై వచ్చాడు. అనంతరం ఇక్కడ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా వున్న ప్రవీణ్‌తో సంబంధాలు కొనసాగించాడు రాజశేఖర్. ఇక్కడ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా వున్న రాజశేఖర్ కంప్యూటర్ హ్యాక్ చేసి పాస్‌వర్డ్‌ను దొంగతనం చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అయితే పాస్‌వర్డ్‌ను తాను ఎక్కడా రాయలేదని శంకర్ లక్ష్మీ చెబుతోంది. కానీ శంకర్ లక్ష్మీ చెప్పిన దానితోనే అతను కంప్యూటర్ హ్యాక్ చేసినట్లు నిర్ధారించారు.
అనంతరం పెన్‌డ్రైవ్ ద్వారా 5 ప్రశ్నాపత్రాలను కాపీ చేసి దానిని ప్రవీణ్‌కు ఇచ్చాడు. అనంతరం ఏఈ పరీక్షా పత్రాన్ని రేణుకకు అమ్మాడు ప్రవీణ్. ఈ క్రమంలో ఫిబ్రవరి 27నే పేపర్ లీకైనట్లు సిట్ గుర్తించింది. తొలుత గ్రూప్ 1 పరీక్షా పత్రం లీకైనట్లు తేల్చింది. ప్రవీణ్‌కు 103 మార్కులు రావడంతో సిట్ విచారణ జరిపింది. కమీషన్ సెక్రటరీ దగ్గర పీఏగా పనిచేస్తూ ప్రశ్నాపత్రాన్ని కొట్టేసినట్లుగా సిట్ నిర్ధారించింది. మరోవైపు పేపర్ లీక్ కేసులో నిందితులకు న్యాయస్థానం ఆరు రోజుల కస్టడీ విధించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 9 మందిని సిట్ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో రేపటి నుంచి ఈ నెల 23 వరకు నిందితులను సిట్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్ధానం ఆదేశాలు జారీ చేసింది.