ఎన్ఐటి- జంషెడ్ పూర్ లో మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్న ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అజయ్‌తండాకు చెందిన తేజావత్‌ సంధ్య(19) గురువారం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేయగా.. ప్రాథమిక విచారణలో కేసు ఊహించని మలుపు తిరిగింది. 

ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థిని సంధ్య కాల్‌ డేటాను పరిశీలించి చూస్తే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు విద్యార్థిని సంధ్య భద్రాచలం స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీలో పదో తరగతి చదివే సమయంలో ఆమెకు ఇంగ్లీష్‌ తరగతులు బోధించిన ఓ ఉపాధ్యాయుడు  సదరు విద్యార్థినిని తరచుగా వేధించేవాడని తెలియవచ్చింది. 

విద్యార్థిని సంధ్య ఆత్మహత్యకు పాల్పడే ముందు కూడా సంధ్య చివరగా మాట్లాడింది ఆ ఉపాధ్యాయుడితోనే అని తేలింది. చదువుల్లో ప్రతిభ చూపిన సదరు విద్యార్థిని చిన్నప్పటి నుండి స్కూల్ అఫ్ ఎక్సలెన్సీల్లోనే చదివింది. 5వ తరగతిలోనే గురుకులకి సెలెక్ట్ అయిందని, అక్కడ ప్రతిభ ఆధారంగా భద్రాచలం స్కూల్ అఫ్ ఎక్సలెన్సీకి ఎంపికయినట్టు తెలిపారు. 

అక్కడ చదువుతున్న సమయంలో ఇంగ్లీష్ బోధించే ఉపాధ్యాయుడు కొన్ని ఫోటోలు తీసి ఈ అమ్మాయిని తరచు బెదిరించేవాడని తెలిసింది. కాల్ డేటా పరిశీలించిన పోలీసులు ఆ ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేసారు. ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న సంధ్య కుటుంబ సభ్యులు, తండా వాసులు స్టేషన్ ముందు బైఠాయించారు. 

ఆ నీచుడ్ని తమకు అప్పగించాలని వారు డిమాండ్ చేసారు. పోలీసులు వారితో చాలా సేపు చర్చించి వారిని శాంతిపజేశారు. తమకు న్యాయం చేయాలనీ ఆ తండ్రి పోలీసుల కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతుంటే... అక్కడున్న వారంతా ఎమోషనల్ అయ్యారు. నేరస్తుడు ఎంతటివాడైనా, వెనుక ఎవరున్నా సరే నేరస్తుడికి కఠిన శిక్షపడేలా చూస్తామని అన్నారుపోలీసులు.