Asianet News TeluguAsianet News Telugu

ధరణి పోర్టల్‌లో సమస్యలు.. భూ యజమానుల తంటాలు, పరిష్కారం కోసం కొత్త సాఫ్ట్‌వేర్

భూ దస్త్రాల‌ను డిజిటలైజ్ చేసి, భూ సమస్యలను సులువుగా పరిష్కరించడానికి తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ చాలా చోట్ల ఇబ్బంది పెడుతోంది. ఒక‌రి పేరుపై ఉండాల్సిన భూమి మ‌రొక‌రి పేరుపైన ఉంటోంది. దీంతో అస‌లైన భూ య‌జ‌మానులు ఆఫీసుల చుట్టూ తిర‌గాల్సి వ‌స్తోంది.

new software for dharani portal to clear doubts
Author
First Published Mar 15, 2023, 3:14 PM IST

భూముల క్రమబద్దీకరణతో పాటు రిజిస్ట్రేషన్, క్రయ విక్రయాలు అత్యంత పారదర్శకంగా వుండేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్‌లో కొన్ని సమస్యలు వస్తున్నాయి. దీంతో అధికారులు, ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ప్రజల నుంచి విమర్శలు, ఫిర్యాదులు వస్తుండటంతో ప్రభుత్వం స్పందించింది. ధరణి పోర్టల్‌లో వస్తున్న సమస్యలకు పరిష్కారం కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నారు సీసీఎల్ఏ విభాగం అధికారులు.

ఈ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు వారంలోపే పూర్తి చేసి.. అందుబాటులోకి తీసుకొస్తామని సీసీఎల్ఏ ప్రధాన కమీషనర్ నవీన్ మిట్టల్ స్పష్టం చేశారు. భూముల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి సందేహాల నివృత్తికి గాను పోర్టల్‌లో ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా రైతులు తమ సమస్యను సులభంగా గుర్తించి.. వాటికి ఏం చేయాలనేది కూడా తెలుసుకోవచ్చని నవీన్ మిట్టల్ వెల్లడించారు. గతంలో పలు కేసులకు సంబంధించిన పరిష్కారాలు, సూచనలు , సలహాలు.. ఎవరెవరిని కలవాలనే దానిపై కొత్త సాఫ్ట్‌వేర్‌‌లో ఫీచర్స్ వుంటాయని ఆయన చెప్పారు. 

Also Read: Dharani : ధరణి సమస్యల పరిష్కారంలో రంగారెడ్డి ముందంజ.. క‌లెక్ట‌ర్ అమోయ్ కుమార్ చొర‌వే కార‌ణం..

కాగా.. రంగారెడ్డి జిల్లాలో ఇలా ధ‌ర‌ణి స‌మ‌స్య‌లు వెంట వెంట‌నే ప‌రిష్కారం కావ‌డంలో ఆ జిల్లా కలెక్ట‌ర్ అమోయ్ కుమార్ కృషి ఎంతో ఉంది. ధ‌ర‌ణి స‌మ‌స్య‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు పరిష్కరించేలా ఆయన ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ధ‌ర‌ణి అధికారులను కలెక్టర్ పరుగులు పెట్టిస్తున్నారు. సామాన్య ప్రజలు ధరణి విషయమై ఎప్పుడు కలెక్టరేట్ కు వచ్చినా అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు చేప‌ట్టారు. దీని కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబ‌ర్ ను ఏర్పాటు చేశారు. దీనికి వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను నిరంత‌రం పర్య‌వేక్షించారు. 

ఇలా అధికారుల‌ను ప‌రుగులు పెట్టిస్తూ, సామాన్యుల‌కు అందుబాటులో ఉండ‌టం వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు అనేక ధ‌ర‌ణి స‌మ‌స్యలు ప‌రిష్కారం అయ్యాయి. ధరణి నిషేధిత భూముల జాబితా ఇప్పటికే 90 శాతం దరఖాస్తులను క‌లెక్ట‌ర్ క్లియర్ చేయించారు. అందుకే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ధరణి పట్ల వ్యతిరేకత వెలిబుచ్చినా రంగారెడ్డి జిల్లాలో ఎవ‌రూ అసంతృప్తి వ్య‌క్తం చేయ‌లేదు. ఇందులో కలెక్ట‌ర్ కృషి ఎంతోగానో ఉంది. ధరణి విషయంలో రంగారెడ్డి జిల్లా యంత్రాంగం చేసిన కృషిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కూడా అభినందించారు. తెలంగాణ‌లోని అన్ని జిల్లాలతో పోలిస్తే ఇక్క‌డ ధ‌ర‌ణి స‌మ‌స్యలు చాలా త‌క్కువ‌గానే ఉన్నాయ‌ని నివేదిక‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios