మిర్యాలగుడా: అమృత వర్షిణి తండ్రి మారుతీ రావు ఆత్మహత్య సంఘటనలో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. అమృత వర్షిణి ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్ ను మారుతీ రావు కిరాయి హంతకులతో హత్య చేయించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూతురు అమృతను తన వద్దకు తెచ్చుకోవాలని మారుతీ రావు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. 

అమృత వర్షిణి వద్దకు రాయబారులను పంపి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయితే, తాను తన అత్తగారి ఇంట్లోనే ఉంటానని, తండ్రి వద్దకు రానని ఆమె మొండికేస్తూ వచ్చింది. పైగా రాయబారులను పంపుతుండడంతో తనను వేధిస్తున్నారంటూ మారుతీ రావుపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఈ కేసు కూడా మారుతీ రావుపై నమోదైంది. 

Also Read: మారుతీరావు ఆత్మహత్య: అమృత ఇంటి వద్ద భద్రత పెంపు

ఈ క్రమంలోనే చివరగా న్యాయవాదులతో అతను రాయబారాలు నడిపినట్లు తెలుస్తోంది. తన వద్దకు రప్పించుకోవడానికి మారుతీ రావు ఆస్తి ఆశచూపుతూ వచ్చాడని అంటున్నారు. న్యాయవాదుల ద్వారా చేసిన ప్రయత్నాలు కూడా ఫలించకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని ఆయన మూడు రోజుల క్రితమే నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. 

మూడు నెలల నుంచి అమృతతో మారుతీ రావు సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నారు. ఆమె వినకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. శనివారం ఉదయం మిత్రుడు ఫెర్టిలైజర్ షాపు నుంచి పురుగుల మందు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 

Also Read: అమ్మ దగ్గరకు వెళ్లు: అమృతకు మారుతీరావు చివరి మాటలు

పోలీసుల ఒత్తిళ్ల కారణంగానే మారుతీ రావు ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన భార్య చెబుతోంది. అయితే, ప్రణయ్ హత్య కేసు ట్రయల్స్ ప్రారంభం కావడంతో కేసు నుంచి బయటపడేందుకే మారుతీ రావు అమృతతో రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నించాడని అంటారు. 

తరుచుగా అతను హైదరాబాదులోని ఓ న్యాయవాదిని కలుస్తున్నట్లు చెబుతున్నారు. పరువు పోయిందంటూ గత కొద్ది కాలంగా ఇంట్లో కూడా గొడవలు జరుగుతున్నాయని అంటున్నారు. అమృత వినకపోవడంతో అతను డిప్రెషన్ లోకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు.