హైదరాబాద్:   అమృత.. అమ్మ దగ్గరకు వెళ్లు అంటూ  ఒకే వాక్యాన్ని సూసైడ్ లెటర్‌లో రాశాడు. గిరిజా నన్ను క్షమించు అంటూ  మారుతీరావు సూసైడ్ లేఖ రాశాడు. 
ఈ సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ దిశగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also read:మారుతీరావు ఆత్మహత్య: ఆస్తి వివాదాలు,ప్రణయ్ కేసే కారణమా?

 ప్రణయ్ హత్య కేసు విషయమై హైద్రాబాద్‌లో ప్రముఖ లాయర్‌తో మాట్లాడేందుకు  మారుతీరావు శనివారం నాడు హైద్రాబాద్‌కు వచ్చాడు. ఆదివారం నాడు ఇదే విషయమై  లాయర్‌ను కలవాలని  ఉదయం ఎనిమిదిన్నర గంటలకు తనను లేపాలని మారుతీరావు డ్రైవర్‌ రమేష్ కు చెప్పాడు. శనివారం నాడు రాత్రి మారుతీరావు తన భార్యతో పాటు కొందరు బంధువులతో ఫోన్‌లో మాట్లాడినట్టుగా తెలుస్తోంది.

ఆదివారం  నాడు ఉదయం  మారుతీరావు ఎంతకూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో మారుతీరావు భార్య గిరిజ  డ్రైవర్‌కు ఫోన్ చేసింది. డ్రైవర్ మారుతీ రావు  రూమ్‌ వద్దకు తలుపు కొట్టాడు. అతను ఎంతకు తలుపు తీయలేదు.

దీంతో తలుపులు బద్దలుకొట్టి చూస్తే ఆయన అప్పటికే  మృతి చెందాడు. ఇంకా ప్రాణాలతో ఆయన బతికి ఉన్నాడని భావించి  పోలీసులు  ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే మారుతీరావు మృతి చెందినట్టుగా వైద్యులు ప్రకటించారు. 

అమృత పెళ్లి చేసుకొన్న ప్రణయ్‌ 2018 సెప్టెంబర్ 14వ తేదీన మిర్యాలగూడలో హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో మారుతీరావు ప్రధాన నిందితుడు ఈ కేసులో వరంగల్ జైల్లో శిక్షను అనుభవించిన  మారుతీరావు ఎనిమిది మాసాల క్రితం  జైలు నుండి విడుదలయ్యాడు.