హైదరాబాద్: నమ్మకంగా పనిలో చేరిన నేపాలీకి చెందిన కొందరు పని ఇచ్చిన యజమాని ఇంటికే కన్నం వేశారు. ఆహారంలో మత్తు మందు కలిపి ఇంట్లో బంగారం, నగలను దోచుకొన్నారు. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటు చేసుకొంది.

హైద్రాబాద్ రాయదుర్గంలో మధుసూధన్ రెడ్డి ఇంట్లో నేపాల్ కు చెందిన రాజేందర్ అలియాస్ రవి పది నెలల క్రితం పనిలో చేరాడు. మధుసూధన్ రెడ్డి కుటుంబసభ్యులకు నమ్మకంగా మెలిగాడు.

దీంతో నేపాల్ కు చెందిన మనోజ్, జానకి అనే ఇద్దరిని కూడ రాజేందర్ ఇదే ఇంట్లో పనికి కుదిర్చాడు.  వీరంతా ఇంటి యజమానికి అత్యంత నమ్మకంగా ఉండేవారు.
ఈ ఇంట్లోని బంగారం, నగదును దొంగిలించాలని వీరు ప్లాన్ చేసుకొన్నారు. సమయం కోసం ఎదురు చూస్తున్నారు. 

సోమవారం నాడు రాత్రి మధుసూధన్ రెడ్డి కుటుంబసభ్యులకు మత్తు మందు కలిపిన ఆహారాన్ని ఇచ్చారు. ఈ ఆహారం తిన్న మధుసూధన్ రెడ్డి ఆయన భార్య శైలజ కొడుకు నితీష్ రెడ్డి, కోడలు దీప్తిరెడ్డి, మనమడు ఆయాన్ రెడ్డికి పెట్టారు. 

ఈ ఆహారం తిన్న వారంతా అపస్మారక స్థితిలోకి వెళ్లారు.  దీంతో నిందితులు రూ. 15 లక్షల నగదు, ఐదు తులాల బంగారు నగలను తీసుకెళ్లారు.  సీసీటీవీ డీవీఆర్ తో పాటు బాధితుల మొబైల్ ఫోన్లను కూడ నిందితులు తీసుకెళ్లారు. 

మధుసూదన్ రెడ్డి భార్య శైలజ ఈ ఆహారాన్ని తక్కువ మోతాదులోనే తీసుకొంది. అయితే ఆమె త్వరగానే కోలుకొంది. తమ ఇంట్లో నిందితులు చోరీ చేస్తున్న విషయాన్ని గుర్తించింది. కానీ ఆమె ఆపలేకపోయింది. 

ఇవాళ ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన మధుసూధన్ రెడ్డి  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.