హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్‌లో జనావాసాల మధ్య మహిళ దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్‌లో జనావాసాల మధ్య మహిళ దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. శంషాబాద్ మున్సిపల్ కేంద్రం శ్రీనివాస ఎన్‌క్లేవ్ సమీపంలోని ఓ బహిరంగ ప్రదేశంలో గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపారు. ఈ క్రమంలోనే హత్యకు గురైన మహిళను శంషాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని రాళ్లగూడదొడ్డికి చెందిన వడ్ల మంజులగా గుర్తించారు. మరోవైపు మంజుల కనిపించడం లేదని అప్పటికే ఆమె భర్త లక్ష్మయ్య కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంజుల కనిపించకుండా పోయిన రోజే హత్యకు గురైనట్టుగా గుర్తించారు.
ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు ఆర్థిక లావాదేవీలే ప్రధాన కారణంగా గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు రిజ్వానాగా పోలీసులు అనుమానిస్తున్నారు. మంజుల ఇంటి సమీపంలో రిజ్వానా లేడీస్ ఎంపోరియం నడుపుతోంది. అయితే రిజ్వానాకు మంజుల లక్ష రూపాయల వరకు అప్పుగా ఇచ్చింది. ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించకపోవడంతో పాటుగా గత రెండు నెలలుగా రిజ్వానా వడ్డీకూడా చెల్లించలేదు. దీంతో రిజ్వానా ఇంటికి వెళ్లి మంజుల, భర్త లక్ష్మయ్య గొడవపడ్డారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడికి గురిచేశారు.
ఈ క్రమంలో మంజుల హత్యకు రిజ్వానా కుట్ర చేసినట్టుగా తెలుస్తోంది. ప్లాన్ ప్రకారం మంజులను హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని కాల్చివేసింది. ఇక, రిజ్వానా భర్తతో పాటు ఇతర కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారించారు. అయితే విచారణ అనంతరం వారిని పంపించి వేశారు. దీంతో ఈ ఘటనతో వారికి సంబంధం లేదని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది.
ఇక, ఓ మహిళ మృతదేహం కాలిపోతున్నట్లు గురువారం అర్ధరాత్రి తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. తాము సంఘటనా స్థలానికి చేరుకుని.. సగం కంటే ఎక్కవ కాలిన స్థితిలో మహిళ మృతదేహాన్ని గుర్తించడం జరిగిందని చెప్పారు. అనంతరం కాలిన స్థితిలో ఉన్న మహిళా మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం చేశారు. క్లూస్ టీమ్ ఘటన స్థలంలో ఆధారాలు సేకరించింది. కాలిపోయిన మహిళా డెడ్ బాడీ దగ్గర అగ్గిపెట్టెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డాగ్ స్క్వాడ్ , క్లూస్ టీమ్ లతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ని కూడా పరిశీలించారు.
మహిళను హత్య చేసి సజీవ దహనం చేశారా? లేక మృతదేహానికి నిప్పంటించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని శంషాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రామచంద్రరావు తెలిపారు. పోస్టుమార్టమ్ నివేదిక తర్వాత ఈ విషయంలో కొంతమేర నిర్ధారణకు వచ్చేందుకు అవకాశం ఉంటుందని పోలీసు వర్గాలు తెలిపాయి.
ఇక, నిందితుల ఆచూకీ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.
