సిద్దిపేట: దుబ్బాక అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతారని ప్రచారం చేయడం తమ కొంప ముంచిందనే అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడిన తర్వాత టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు చెరుకు ముత్యం రెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ టికెట్టు ఆశించాడు. కానీ టీఆర్ఎస్ నాయకత్వం దివంగత ఎమ్మెల్యే సోలిపేట సుజాతకే టికెట్టు కేటాయించారు.తనకు టికెట్టు దక్కకపోవడంతో చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు.

ఈ నెల 3వ తేదీన పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ జరిగిన రోజున చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఓ మీడియా ఛానెల్ లో ఈ వార్త ప్రసారమైనట్టుగా  సోషల్ మీడియాలో ప్రసారమైంది.

ఈ ప్రచారంపై తొగుట పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి కూడ ఫిర్యాదు చేశాడు.

ఎన్నికలు పూర్తైన తర్వాత చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతారని చేసిన ప్రచారంకూడ తమను తీవ్రంగా నష్టపర్చిందనే అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది.

2018 ఎన్నికల్లో చెరుకు ముత్యం రెడ్డికి టికెట్టు కేటాయించకపోవడంతో ఆయన వర్గం ఇతర పార్టీల్లో చేరింది. శ్రీనివాస్ రెడ్డితో పాటు ముత్యం రెడ్డి వర్గీయులు కాంగ్రెస్ లో చేరలేదు. వీరిని తిరిగి పార్టీల్లోకి చేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేసిన ప్రయత్నాలు ఆశించిన మేరకు ఫలితాలు ఇవ్వలేదు.

also read:దుబ్బాక బైపోల్: ఆధిక్యంలో బీజేపీ,గ్రామీణ ఓటర్లపైనే టీఆర్ఎస్ ఆశలు

కాంగ్రెస్ పార్టీ టికెట్టు ఆశించిన  నేతలు వెంకట నర్సింహా రెడ్డి, మనోహార్ రావుతో పాటు మద్దూరు నాగేశ్వర్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలంతా నియోజకవర్గంలోనే మకాం వేసిన ఆశించిన ఫలితం లేకుండా పోయింది.

రామలింగారెడ్డి మరణించిన తర్వాత ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్దం కాలేదు. టీఆర్ఎస్, బీజేపీలు ఈ విషయమై ముందు నుండి పకడ్బందీ వ్యూహాంతో ముందుకు సాగాయి. ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు ఆ పార్టీ యంత్రాంగం కదల్లేదు.