స్థూలంగా  ఈ మూడేళ్ల  పాలన ఒక అవమానం అంటున్నారు ప్రజాతెలంగాణా కో కన్వీనర్ శ్రీశైల్ రెడ్డి. ‘ఇది ఒక ఆవేదన,  ఆక్రందన.  అయినా, వెరుపు లేదు. ఇపుడున్న దుక్నం బంద్ కావాలే.  ప్రజా తెలంగాణా రావాలే. సకల జనులూ మళ్ళీ ఉద్యమించాల్సిన, అందుకు పునరంకితం అవ్వాల్సిన సందర్భం ఇది.సమస్త తెలంగాణ బిడ్డలకు స్వరాష్ట్ర 3వ ఆవిర్భావ శుభాకాంక్షలు!’

సమస్త తెలంగాణ బిడ్డలకు స్వరాష్ట్ర 3వ ఆవిర్భావ శుభాకాంక్షలు!

మనందరం సగర్వంగా మనకు మనం అభినందనలు తెల్పుకొవాలె. అందరికంటే ముందు, 1952 నాన్-ముల్కీ గో బ్యాక్ ఉద్యమకారులకు, ఆ తర్వాత 1969 అమరవీరులకు, అనంతరం 1996 మలిదశ ఉద్యమవీరులకు, రాష్ట్ర సాధన చివరి దశలో ప్రాణాలు అర్పించిన యువకిశోరాలకు... కృతఙ్ఞతలు కాదు... మన మనసులను హారతిలా వెలిగించి వినమ్రులై వుండాలె. 

వ్యక్తులుగా చెప్పుకోవాలంటే, 1990 దశకంలోనే తెలంగాణ వెనుకబాటు మీద పుస్తకాల ద్వారా భావవ్యాప్తి చేసి, తెలంగాణ కాంక్షను రగిలించిన గాదె ఇన్నయ్య వేసిన బీజాలే వరంగల్, భువనగిరి డిక్లరేషన్ లు. 'దగాపడ్డ తెలంగాణ' పేరుతో ఆయన చేసిన గణాంక సహిత యుద్ధం కేసీఆర్ ను ఆకర్షించింది. తెరాస ఆవిర్భావంలో, కేసీఆర్ కు దశ దిశ ఇవ్వడంలో, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను బలంగా ముందుకు తేవడంలో గాదె ఇన్నయ్య ఆద్యులు. 

అనంతరం, ఆచార్య జయశంకర్, ప్రొఫెసర్ కోదండరాం ల నేతృత్వంలో ఈ ఉద్యమ సెగ పల్లెపల్లెకూ పాకింది. రైతులు, మహిళలు, వృద్దులు, పిల్లలు, కార్మికులు, కూలీలు, యువకులు, నిరుద్యోగులు... సకల జనం పోరుబాట పట్టింది. వీరికి రాజకీయ నేతృత్వం వహించిన కేసీఆర్ ఆ రోజుల్లోనే తన చిత్తశుద్ది రాహిత్యాన్ని అడుగడుగునా చాటుకున్నాడు. దీక్షలో అర్థాంతరంగా జ్యూస్ తాగి యువత ఆశలపై నీళ్ళు చల్లిండు. మిలియన్ మార్చ్ ఫెయిల్ చేయ చూసిండు. తెలంగాణ బిల్లు పాసైన రోజు పార్లమెంటుకే డుమ్మా కొట్టిండు. 

రాజకీయపరంగా చూస్తే - తెలంగాణ క్రెడిట్ సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్ లతో పాటు జైపాల్ రెడ్డి లాంటి వాళ్లకు దక్కుతుంది. పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టి రాష్ట్రం యిచ్చారు సోనియాగాంధీ. 

పై చెప్పిన అందరికీ తెలంగాణ బిడ్డల మంగిడీలు. 

కేసీఆర్ గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఈ మూడేళ్ళ సంబురాల గురించి చెప్పుకోవాల్సి వస్తే : 

1. మూడేళ్ళలో 2855 రైతుల ఆత్మహత్యలు. బతికున్న రైతులకు బేడీలు 

2. రాష్ట్రం వచ్చినంక ఆరు మంది కళాకారుల ఆత్మహత్యలు. బిచ్చగాళ్ళుగా మారిన ముగ్గురు కళాకారులు

3. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన 1500 మంది అమర వీరుల కుటుంబాలకు ఇంకా దక్కని న్యాయం

4. ప్రజా నిరసన కాలరాసేలా ధర్నా చౌక్ మూసివేత 

5. ఉద్యమ ద్రోహులకు పదవులు. నేడు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు వారి చేతుల మీదుగా

6. కేంద్ర చట్టాల్ని, కోర్టుల ఆదేశాల్నీ ఖాతరు చేయకుండా భూదోపిడీ. 900 రోజులుగా ఎర్రగుంటపల్లి, సంవత్సర కాలంగా వేములఘాట్ ప్రజల నిరవధిక దీక్షలు

7. బినామీ మంత్రులతో భూదందాలు. మియాపూర్ లో మొదలై రాష్ట్రమంతా విస్తరించిన దందా. కేసీఆర్ కుటుంబ వాటా. కీలక పాత్రధారి బీటీ మంత్రిని వొదిలేసి, ఆఫీసర్లకు శిక్ష 

8. గ్యాంగ్స్టర్ నయీం కేసులో తన పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులనూ ఒదిలేసి, పోలీసు ఆఫీసర్ల బలి. 

9. రాష్ట్రం ఒచ్చినంక 7 మంది ఎస్సైల ఆత్మహత్య. తీవ్రమైన ఒత్తిడిలో పోలీసు యంత్రాంగం

10. విద్యకు, ఉద్యోగాలకు, ఉపాధికి యువతను దూరం చేసిన క్రూర పరిహాసం కేసీఆర్ మూడేళ్ళ పాలన. 4 వేల స్కూళ్ళ మూసివేత. ఇంటికో ఉద్యోగం కాదు కదా జిల్లాకో ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఇప్పటికీ. టెన్త్, ఎంసెట్... ప్రతీ పరీక్షా ప్రహసనమే. డీఎస్సీ వేయలేదు. ఉపాధి అవకాశాలు లేవు. ఇవన్నీ అడుగుతారని మొన్న ఉస్మానియాలో నోరుకూడా పెగలలేదు దొర కు. 

11. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కేసీఆర్ హయాంలో జరగని పని. భూమి లేక కాదు, సంకల్పం చిత్తశుద్ది లేక. ప్రేమ లేక. 

12. రాజ్యంలో, ఉద్యోగాల్లో, మీడియాలో, కాంట్రాక్టుల్లో, అధికారాల్లో అంతా ఆంధ్రామయం. తెలంగాణ ద్రోహులమయం. ఉద్యమకారులను అన్నిటికన్నా బాధిస్తున్న అంశం యిది. 

13. ఉద్యమ సమయంలో తానే వద్దన్న ఓపెన్ కాస్టులపై నేడు ప్రేమ. కొత్తగా 11 ఓపెన్ కాస్టుల ద్వారా సింగరేణిని బొందలగడ్డగా మార్చే ప్రయత్నం. 

14. సెక్రటేరియట్ దుబాయ్ కంపెనీకి అప్పజెప్పి, వాటాలూ, ముడుపులూ తీసుకుని, ప్రగతి భవన్ పేర దొరల దర్బార్ కొలువుదీరింది. తనకు నచ్చిన వారిని, తాను పిలిపించుకున్న వారిని మాత్రమే ప్రజలుగా గుర్తిస్తున్నాడు. పాలాభిషేకాలు చేయించుకుంటున్నాడు. 

15. అవినీతి, అక్రమాలకూ కామధేనువులా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ. అందుకే మొన్న మీడియా ముఖంగా సిగ్గూ శేరమూ లేకుండా వచ్చే ఎన్నికల్లో ప్రతి ఎమ్మెల్యే ఖర్చు తనదే అన్నాడు కేసీఆర్. 

16. తానూ, తన కొడుకు, కూతురు, మనవడు తప్ప తెలంగాణకు వేరే అర్థం, పరమార్థం లేదని, పూజా పునస్కారాలు, మొక్కులు, బహిరంగ సాష్టాంగ ప్రమాణాలు, కాల్మొక్త బాంచెన్ సం స్కృతి, గడీలకు హెరిటేజ్ ద్వారా తెలంగాణను వందేళ్ళు వెనక్కు తీసుకుని పోవడానికి ప్రణాలికలు.

స్థూలంగా ఇదీ నేటి తెలంగాణ. నేటి అవమానం. నేటి ఆవేదన. నేటి ఆక్రందన. 

అయినా, వెరుపు లేదు. ఇపుడున్న దుక్నం బంద్ అయ్యే రోజులు వొచ్చినయి. రాబోయేది ప్రజా తెలంగాణా. సకల జనులూ మళ్ళీ ఉద్యమించాల్సిన, అందుకు పునరంకితం అవ్వాల్సిన సందర్భం ఇది. పాలకుడి మార్పు కాదు. పరిపాలన మార్పుకై, మరో పోరాటానికై కలవాలి

(*రచయిత ‘ప్రజా తెలంగాణ’కో-కన్వీనర్,హైదరాబాద్ ఫోన్: 9030997371)