ఆర్ధిక వివాదాలతో సుబ్బారెడ్డిని చంపాలని అఖిలప్రియ అనుకుందని విన్నామన్నారు కిడ్నాప్‌కు గురైన నవీన్ రావు బంధువు ప్రతాప్ రావు. దాంతో పోలిస్తే మేమెంత అన్నారు.

అఖిలప్రియ మమ్మల్ని నేరుగా ఎప్పుడూ సంప్రదించలేదని ప్రతాప్ రావు చెప్పారు. భూమా నాగిరెడ్డితో తన తండ్రి చాలా సన్నిహితంగా వుండేవారని.. ల్యాండ్ విషయాలు భూమా నాగిరెడ్డి తరపున ఏవీ సుబ్బారెడ్డి చూసుకునేవారని ప్రతాప్ రావు వెల్లడించారు.

Also Read:అక్క అరెస్ట్ వెనుక రాజకీయ ఒత్తిళ్లు.. హైదరాబాద్‌లో సేఫ్టీ లేదు: భూమా మౌనిక

ల్యాండ్ విషయంలో ఆయనతోనే తమకు సంబంధాలు వున్నాయని ప్రతాప్ రావు తెలిపారు. భూమా నాగిరెడ్డి ఆర్ధిక లావాదేవీలు కూడా ఏవీ సుబ్బారెడ్డే చూసుకునేవారని చెప్పారు. అందుకే తాము సుబ్బారెడ్డిని సంప్రదించి ల్యాండ్ డీల్ చేసుకున్నామని ప్రతాప్ రావు తెలిపారు.

ల్యాండ్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు అఖిలప్రియ దగ్గర వుంటే లీగల్‌గా వెళ్లవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని.. కానీ ఇళ్లలోకి చొరబడి కిడ్నాప్ చేసి ప్రాణాలు తీసేంతగా భయపెట్టడం కరెక్ట్ కాదని ప్రతాప్ రావు హితవు పలికారు.  కిడ్నాప్ తర్వాత సుబ్బారెడ్డి తమతో టచ్‌లోకి రాలేదని.. తాము కూడా మాట్లాడలేదని ఆయన వెల్లడించారు.